Mahanaadu-Logo-PNG-Large

అందుకే.. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్!

బట్టల షాప్ ప్రారంభానికి సినీనటి…జనాలను అదుపు చేయలేకపోయిన పోలీసులు…ట్రాఫిక్ జామ్.
విదేశీ ఐకియా / లులు షాప్స్ ప్రారంభం…జనాలను అదుపు చేయలేక పోయిన సెక్యూరిటీ సిబ్బంది… తొక్కిసలాట.
సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా జన సంద్రమే!
కోటి దీపాల ఆరాధన కార్యక్రమం…. లక్ష మందికి పైగా వారం రోజులు సమయం కేటాయించి తప్పకుండా హాజరు.
పెద్దాయనకు ఉత్సవాలు….లక్షలాది మంది వారం పది రోజులు క్రమం తప్పకుండా హాజరు, గంటల సమయం కేటాయింపు.
పుష్కరాలు వచ్చాయి…. దూరాన్ని సైతం లెక్క చేయకుండా కోట్లాది మంది హాజరు. కొన్ని సందర్భాల్లో తొక్కిసలాట, మరణాలు.
కొత్త బాబా వచ్చాడు… వాడెవడో తెలియకుండానే వేలం వెర్రిగా హాజరు, అతనికి పాద పూజలు… కోరిన కానుకలు సమర్పణ.
సారాయి షాపులు…బార్ షాపుల వద్ద… రాత్రి పగలు ఎప్పుడు చూసినా జనాలే!. డబ్బు, ఆరోగ్యం, సమయం వృధా.
కానీ… మన బ్రతుకులను తీర్చిదిద్దే ఓటు వేయటానికి మాత్రం… అర్ధగంట సమయం హైదరాబాదీలకు లేదు. ఎప్పుడూ 40 – 45 శాతానికి మించి ఓటు వేయరు. ఈసారి ఏకంగా 40 శాతానికి లోపే ఆగిపోయారు.
మరో విశేషం ఏమిటంటే…. అర్దగంట కంటే తక్కువ సమయం పట్టే ఓటు వేయటానికి వేతనంతో కూడిన సెలవు కావాలి. ప్రభుత్వం అందించే అన్ని ఉచిత పథకాలు కావాలి.
మా హైదరాబాదీలకు మరో విశేషం కూడా ఉంది… అదే… ప్రభుత్వాలను దుమ్మెత్తి పోయడం. ప్రభుత్వాలు ఎలా పని చేయాలో, ఏ పనులు చేయాలో… ఏ పనులు చేయకూడదో… మంచం మీద తడిగుడ్డ వేసుకుని పడుకొని, సామాజిక మాధ్యమం ద్వారా నీతులు చెపుతూ ఉంటారు.
అందుకే… ‘కన్యా శుల్కం’ లో గిరీశం అంటాడు ‘ మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్! అని. ఆయన ఎప్పుడో దశాబ్ధాల క్రితం చెప్పిన ఈ మాట మా హైదరాబాదీలకు ఇప్పటికీ వర్తిస్తుంది.

– మాదివాడ రామబ్రహ్మం
సామాజిక కార్యకర్త