రాష్ట్రంలో పేదల పాలిట అక్షయపాత్ర.. అన్న క్యాంటీన్లు

– అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నక్యాంటీన్లు పేదల పాలిట అక్షయపాత్ర అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివర్ణించారు. పేదల కష్టం, ఆకలిబాధ తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన అన్నక్యాంటీన్లపై కూడా జగన్ కక్షతీర్చుకోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. వినుకొండలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. పలువురికి స్వయంగా అల్పాహారం వడ్డించారు.

స్థానిక ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే అల్పాహారం తిన్నారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చాటిచెప్పిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన బాటలో సమాజంలో ఉన్న పేదలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బున్న వాళ్లకి ప్రభుత్వ సహకారం అవసరం లేదని, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారితో పాటు కూలినాలి పనులు చేసుకుంటూ రూ.300, రూ.400, రూ.500 సంపాదించే కార్మికులకు, పేదలకు ఈ అన్న క్యాంటీన్ల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. దాన్ని గుర్తించిన చంద్రబాబు గతంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చారన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూసివేయించారని మండిపడ్డారు. రూ.5కే అన్నం పెట్టి పేదల ఆకలి తీర్చే గొప్ప పథకాన్ని మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్, బిజెపి నాయకులు మేడం రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఆయభ్ ఖాన్, పీవీ సురేష్ బాబు, షమీంఖాన్, గంధం కోటేశ్వరరావు, వాసిరెడ్డి లింగమూర్తి, గట్టుపల్లి శ్రీనివాసరావు, పువ్వాడ కృష్ణ పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.