బాలికపై లైంగిక దాడి కేసు
పోక్సో చట్టం కింద అరెస్టు, రిమాండ్
కర్నూలు, మహానాడు : రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధంస్వం చోటు చేసుకున్న నేపథ్యంలో ఓ మాజీ ఎమ్మెల్యే రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అదేకోవలో మరో మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలపై రిమాండుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రెడ్డిని గురువారం కర్నూల్ రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఒక బాలికను లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఆ విషయంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉదయం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను ఆయన ఇంటి వద్ద కర్నూలు టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో సుధాకర్ డాక్టరు వృత్తిలో ఒక బాలికను లైంగికంగా వేధించారనే వీడియో వెలుగులోకి వచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసభ్యకర పనిచేశారంటూ ఉమ్మడి జిల్లా వాసులు మాజీ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బాధిత బాలిక గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అందుకు ప్రైవేటుగా పంచాయతీ నిర్వహించారని ప్రచారం జరిగింది. సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ప్రస్తుతం సుధాకర్ ను రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని ఓర్వకల్ మండల పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.