– హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ‘ఇవానా’ ప్రాజెక్టు
– 12.9 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో 1,850 యూనిట్ల నిర్మాణం
– 15 అంతస్తుల్లో 2 టవర్లు, 36 అంతస్తుల్లో 4 టవర్ల ఏర్పాటు
– అంత్యక్రియలకు ప్రత్యేకంగా..
– మీడియాతో అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన
హైదరాబాద్, జూలై 4: రియల్టీ రంగంలో ఉన్న అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇవానా పేరుతో హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లను ఏర్పాటు చేస్తోంది.
మొదటి దశలో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని 2024 డిసెంబర్‌లోగా కొనుగోలుదార్లకు అప్పగిస్తారు. ఇక రెండవ దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో కస్టమర్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద చదరపు అడుగు రూ.6,500లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.
నిర్మాణ వ్యయం తొలి దశ ప్రాజెక్టుకు రూ.380 కోట్లు, రెండవ దశకు రూ.1,600 కోట్లకుపైగా అవుతుందని అంచనాగా చెప్పారు. 1 నుంచి 34వ అంతస్తు వరకు 1,360-2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2-3 పడక గదులను నిర్మిస్తారు. 35-36 అంతస్తుల్లో స్కై విల్లాలు 4 బెడ్రూంలతో 2,900-5,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతంగా రానున్నాయి. కారు పార్కింగ్ స్థలం సైతం మొదట్లోనే రిజిస్ట్రేషన్‌సహా అప్పగిస్తారు.
ఇవానా మొదటి దశలో 8 లక్షలు, రెండవ దశలో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ సమీపంలోని పెదపాలపర్రుకు చెందిన బొప్పన అచ్యుతరావు సివిల్ ఇంజనీర్. ఎల్‌అండ్‌టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత దుబాయిలో కొంత కాలం ఉద్యోగం చేశారు.
2004 నుంచి దుబాయిలో వ్యాపారం మొదలుపెట్టారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సొంతంగా భారీ గృహ సముదాయ ప్రాజెక్టులను చేపడుతున్నారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను చేపట్టారు.
అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా..
ఇవానా గృహ సముదాయాన్ని అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా నిర్మిస్తున్నట్టు అచ్యుతరావు తెలిపారు. తాను సైతం మధ్యతరగతి నుంచి వచ్చానని చెప్పారు. తొలుత అద్దె ఇళ్లలో ఉన్నానని, మూడు దశాబ్దాల్లో అంచలంచెలుగా ఎదిగామని వివరించారు. అపార్ట్‌మెంట్లలో ఉండేవారి అభిరుచులు, వారి అంచనాలను పరిగణలోకి తీసుకునే సమగ్ర ప్రణాళికతో సాధ్యమైనన్ని వసతులు కల్పిస్తూ నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు.
గ్యాడ్జెట్ల నుంచి గార్డెన్‌కు..
భార్యాభర్తలిద్దరూ వృత్తి, వ్యాపారాల్లో నిమగ్నమైతే వారి కుటుంబంలోని చిన్నారులు, వృద్ధులు మొబైల్, టీవీ, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ పద్ధతిని దూరం చేసి వారు కూడా ఆహ్లాదకరంగా ఉద్యానాల్లో విహరించేలా, క్రీడలతో మానసికోల్లాసం పొందేలా తమ నివాస ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని అచ్యుతరావు తెలిపారు.
ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌస్‌లు నిర్మిస్తున్నామని.. ఇవి కాక టవర్లపైన ఒక లక్ష చదరపు అడుగుల్లో గార్డెన్, స్విమ్మింగ్ పూల్‌తోపాటు 3 బేస్‌మెంట్ పార్కింగ్‌ల తరువాత ఒక ఫ్లోర్ మొత్తాన్ని చిన్నారులు, పెద్దల వ్యాహ్యాళికి అనువుగా కేటాయించామని చెప్పారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి.
అపార్ట్‌మెంట్ల నిర్వహణ కోసం ఫ్లాట్ యజమానులు ఏర్పాటు చేసుకునే కార్పస్ ఫండ్‌కు అదనంగా తాము కల్పిస్తున్న కొన్ని క్రీడా సదుపాయాలకు కోచ్‌ల సహా నిర్వహణ నిమిత్తం తమ సంస్థ తరఫునా ఫండ్ నెలకొల్పి ఫ్లాట్ యజమానులకు భారం లేకుండా కొనసాగిస్తామని ఆయన అన్నారు.
1,000 మందితో ఫంక్షన్ చేసుకునేలా..
3.5 ఎకరాల్లో నిర్మిస్తున్న పార్కుతోపాటు ఇతర సదుపాయాల వల్ల 1,000 మంది వరకు అతిథులతో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు చేసుకునేందుకూ నివాసితులకు సౌకర్యంగా ఉంటుందని అచ్యుతరావు తెలిపారు. సూపర్‌మార్కెట్, బ్యాంక్, పిల్లల ట్యూషన్లకు కావాల్సిన గదులతోపాటు చిన్నారుల కోసం క్రష్ కూడా నిర్మిస్తామని చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా ప్రతి టవర్‌లో కింది అంతస్తుల్లో ఏర్పాట్లు ఉంటాయన్నారు.
అంత్యక్రియలకు ప్రత్యేకంగా..
అపార్ట్‌మెంట్‌లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఏర్పాట్ల కోసం ఆ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇతరులకు అసౌకర్యం అవుతుందని ఫీలవుతుంటారు. సుదూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చేవరకు మూడు బాడీలు ఉంచగలిగే స్థాయిలో ఫ్రీజర్ వ్యవస్థ సహా పలు ఏర్పాట్లను ప్రాంగణంలో చేస్తున్నట్టు అచ్యుతరావు వివరించారు.
నాణ్యమైన ఉత్పత్తులనే..
ఇటీవలి సందర్భాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులకు కొన్ని హైరైజ్ అపార్ట్‌మెంట్లలో కిటికీలు పాడవడం గమనించామని, ఆ ఇబ్బంది రాకుండా అంతర్జాతీయ, అత్యుత్తమ సాంకేతిక సంస్థల ప్లానింగ్ ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిస్తున్నట్టు అచ్యుతరావు వెల్లడించారు. కప్‌బోర్డులతోసహా కిచెన్ క్యాబినెట్ల వంటివి తమ వద్ద ఎంచుకోవచ్చని చెప్పారు.