దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్‌

-రికార్డు స్థాయిలో 81.86 శాతం నమోదు
-గత ఎన్నికల కంటే 2.09 శాతం ఎక్కువ
-దర్శిలో అత్యధికం 90.91 శాతం
-తిరుపతిలో అత్యల్పం 63.32 శాతం
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా పూర్తి వివరాలు వెల్లడిరచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని తెలిపారు. 2014లో 78.41, 2019లో 79.77 శాతం పోలింగ్‌ నమోదైనట్లు చెప్పారు. అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్‌, అత్యల్పంగా తిరుపతి అసెంబ్లీలో 63.32 శాతం పోలింగ్‌, అత్యధికంగా ఒంగోలు లోక్‌సభకు 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభకు 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వివరించారు. 3500 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్‌ జరిగిందని, ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్‌ పూర్తయిందని తెలిపారు. కొన్నిచోట్ల వర్షం వల్ల కూడా పోలింగ్‌ ఆలస్యమైందని పేర్కొన్నారు.