ఆక్వా కేపిటల్‌గా ఏపీని మారుస్తాం

– మత్స్య కారుల ఆదాయం పెంచేలా మథర్ షిప్ వ్యవస్థ
– సీడ్ కోసం ఇప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి
– జగన్ ఐదేళ్ల పాలనలో ఎన్‌ఎఫ్‌డీబీ నుండి రూపాయి కూడా తీసుకురాలేకపోయారు
– బందరులో మెరైన్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి
– ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితుల్ని అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆక్వా కేపిటల్‌గా మార్చి తీరుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు గిలకలదిండి ఆదివారం ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితులు, ఫిషింగ్ కోసం మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందంతో పరిశీలించారు. మచిలీపట్నాన్ని ఆక్వాహబ్ గా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

మత్స్య ఉత్పత్తులకు మచిలీపట్నం పెట్టింది పేరు అన్నారు. అప్పట్లో నడకుదిటి నరసింహరావు మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన భవనంలోనే నేడు సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మత్స్యకారుల ఆదాయం పెంపునకు ఉండే అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని జగన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు దారుణంగా నాశనం చేశారన్నారు. వారు చేసిన విధ్వంసం కారణంగా మత్స్యకారులు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. మత్స్య సంపద ఎదుగుదలకు మడ అడవులు ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

సంప్రదాయ వనరుల స్థానంలో పునరుత్పాదక ఇందన వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో సోలార్ పవర్డ్ బోట్స్ అందుబాటులోకి వచ్చాయని, మనం కూడా ఆ సాంకేతికతను వినియోగించుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అదే సమయంలో రవాణా, ఎగుమతుల సమయంలో జరుగుతున్న ప్రమాదాల్లో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందులోనూ నూతన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సీడ్‌కు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక చర్యలు అవసరం అన్నారు. చిన్న చిన్న పడవల్లో వేటకు వెళ్లే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు మథర్ షిప్ వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒకసారి వేటకు వెళితే ఎన్ని రోజులున్నా.. వారికి అవసరమైన ఇంధనం, ఐస్ లాంటివన్నీ ఆ మథర్ షిప్ నుండి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సీడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని భావిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని మత్స్యరంగంలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం ఉన్నదన్నారు.

కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అభివృద్ధి, మచిలీపట్నం అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణానికి గతంలో గడ్కరీ సహకరించారు. ఇప్పుడు సాగరమాల పథకంలో భాగంగా సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో హైవే ఏర్పాటు, మచిలీపట్నం-రేపల్లె రైల్ మార్గం ఏర్పాటు, మచిలీపట్నంలో టూరిజం అభివృద్ధి, బ్యాక్ వాటర్స్ ద్వారా పర్యాటకాభివృద్ధికి కేంద్ర సహకారం కోరతామన్నారు.

జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఫిషింగ్ హార్బర్ అంచనాలు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ల పరిశీలనకు త్వరలో రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు రాబోతున్నారని, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్ర కొల్లు రవీంద్ర తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్య శాఖ కమిషర్ తమ్ము డోలా శంకర్, అదనపు డైరక్టర్ డా.అంజలి, మత్య శాఖ జేడీ ఏ.చంద్రశేఖర్, జిల్లా అటవీ అధికారి కే.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.