Mahanaadu-Logo-PNG-Large

చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

విజయవాడ : వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాల కల్పనలో అలక్ష్యం చేయొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు.

చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు సందర్భంగా… నగరంలోని మేరీస్ స్టెలా కాలేజీ, ఏ ప్లస్ కన్వన్షన్ సెంటర్ ను గురువారం ఆమె పరిశీలించారు. ముందుగా మేరీస్ స్టెల్లా కాలేజీని పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ప్రాంతంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని చేనేత శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఏ ప్లస్ కన్వీన్షన్ సెంటర్ ను పరీశీలించారు.

సీఎం చంద్రబాబునాయుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించే చేనేత ఎగ్జిబిషన్లను ప్రారంభించే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొనే అవకాశముందన్నారు. అతిథుల కార్ల పార్కింగ్, చేనేత కార్మికులు, సందర్శకులకు సౌకర్యాల కల్పనపై ప్రధాన దృష్టి సారించాలని స్పష్టం చేశారు. చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించే అవకాశముందని, ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ నెల ఏడో తేదీ నుంచి పది రోజుల పాటు జరిగే చేనేత ఎగ్జిబిషన్లను ప్రజలు సందర్శించేలా విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. చేనేత కార్మికుల్లో అవగాహన కల్పించి, ఈ చేనేత ఎగ్జిబిషన్ లో అత్యధిక స్టాళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ స్టాళ్లలో చీరలు, ఇతర చేనేత వస్త్రాల విక్రయాల ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగే అవకాశముందన్నారు.

ప్రస్తుతం ఎంత మంది స్టాళ్లు ఏర్పాటుకు ముందుకొచ్చారని మంత్రి ఆరా తీశారు. 80 స్టాళ్లు ఏర్పాటు చేసే అవకాశముందని, ఇందుకోసం 300ల మంది చేనేత కార్మికులు రానున్నారని మంత్రికి అధికారులు వివరించారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ, స్టాళ్లు ఏర్పాటుకు వచ్చే చేనేత కార్మికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్ లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.