పోరాటాల ఫలితంగానే వైకాపా పరాజయం 

పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ 

విజయవాడ, మహానాడు:   ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ద్వారా ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా  సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా  ఘోరపరాజయం  పాలైందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు  రాజేంద్రప్రసాద్ అన్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నుంచి పార్లమెంట్ కు, శాసనసభకు ఎన్నికైన నాయకులకు సన్మాన కార్యక్రమం బాలోత్సవ భవన్లో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఛాంబర్ నాయకత్వం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శ్రీకాకుళం  ఎమ్మెల్యే గొండు శంకర్ లను సన్మానించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…  14, 15వ  ఆర్థిక సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయతీలకు పంపించిన నిధులను గత ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందని, ఆ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ద్వారా వై వి బి రాజేంద్రప్రసాద్ అడుగుజాడల్లో, నాయకత్వంలో పనిచేసి నేను ఈ స్థాయికి వచ్చానన్నారు.

పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘం కు ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఉన్న ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కావలసిన స్ఫూర్తి, ఓర్పు రాజేంద్రప్రసాద్ ద్వారానే నేర్చుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు