– అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ
అమరావతి, మహానాడు: పల్నాడు జిల్లా, దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతిపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, ఆర్డీఎంఏ హరికృష్ణ, డీఎంహెచ్ వో రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ అప్పారావులతో మాట్లాడారు. నీరు కలుషితం కావడం వల్ల చనిపోయారా లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానికంగా ఉన్న బోర్లలో నీటిని విజయవాడ ల్యాబ్ కు పరీక్షలకు పంపాలని మంత్రి నారాయణ ఆదేశించారు. బోర్లను అన్నింటిని మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని మంత్రి సూచించారు.
ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ మంత్రికి తెలిపారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేయడంతో పాటు పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశామని చెప్పారు. డ్రెయిన్ లతో పూడిక యుద్ధ ప్రాతిపదికన తొలగించడంతో పాటు మంచినీటి బోర్లను అన్నింటిని తనిఖీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. అవసరమైతే ఇతర మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని రప్పించాలని, సాధారణ పరిస్ధితి వచ్చే వరకూ మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.