నన్ను గెలిపిస్తే ఇంట్లో కలవొచ్చు..
కమలాపురం సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి
కమలాపురం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కమలాపురం బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మి లారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు..అదే అవినాష్ రెడ్డిని గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బాబాయిని చంపిన హంతకుడికి సీటు ఇచ్చారు. వివేకాకు మగ బిడ్డలు లేరు. జగన్ ను ఆయన కొడుకు అనుకున్నారు. అలాంటి వాడు హంతకులను కాపాడుతున్నాడు. ఈ మధ్య నా మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి అంటున్నాడు… వివేకా హత్య జరిగినప్పుడు సాక్ష్యాలు తుడిచేస్తున్నప్పుడు పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడట…పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అవినాష్ చిన్న పిల్లోడు అంట..ఒక సర్టిఫికెట్ రవీంద్రనాథ్ ఇస్తాడు…మరో సర్టిఫికెట్ జగన్ ఇస్తాడు. అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడు కాదు…అమాయకుడు కాదు..వివేకా హత్య నిందితు డు. న్యాయం కోసం కొంగు పట్టి అడుగుతున్నాం. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా? నేరం వైపు నిలబడతారా? ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు.
నా మేనమామ…ఒక్క పనికూడా చేయలేదట గెలిపిస్తారా?
కమలాపురం అభ్యర్థి నా మేనమామ. ఆయన ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. నా మేనమామ నా కోసం ఇస్తాడు..మేనమామకి బాధ్యత ఉంటుంది కదా? ఆయనకు ఓటేశారు.. ఒక్క పని అయినా చేశారా ? గాలేరు – నగరి ద్వారా 90 వేల ఎకరాలు సాగునీరు ఇస్తామన్నారు…ఇచ్చారా? సర్వారాయ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదు. సర్వారాయ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఏమో కానీ, రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువు, రొయ్యల చెరువుకు నీళ్లు వస్తున్నాయి. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? అధికారం ఉన్నది మీ చెరువులు నింపుకోడానికా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైట్లింగ్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? మంచిదైతే దాని గురించి ఎందుకు దాచారు. చెప్పేదొకటి..చేసేదొకటి..మడమతిప్పడం మీ పేటెంట్ అని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.