బాబూ..విజయనగరం వద్దా!?

విజయనగరం పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే
నీళ్ళు వదిలేసుకుందా?
ఏమో..జనాలు మాత్రం విజయనగరం లోకసభ విషయంలో సైకిల్ పార్టీని లెక్కలోంచి తీసేసారు.
ఎవర్ని కదిపినా బెల్లాన చంద్రశేఖర్ అదృష్టవంతుడు. నక్కని తొక్కాడు..ఇదే కామెంట్..అదే పబ్లిక్ స్టేట్మెంట్..!
ఇంత నిరుత్సాహానికి..
నిర్లిప్తతకు..నిర్వేదానికి..

ఒకటే కారణం…సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్వాకం.. ఔను…పార్లమెంటుఅభ్యర్థి ఎంపిక విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీలో ఏ ఒక్కరికీ నచ్చలేదు.అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పేరు పార్టీలోని చాలా మందికి తెలియని పరిస్థితి..
ఇక జనం అయితే ఆయన పేరు చెబితేనే పెదవి విరిచేస్తున్నారు. విజయనగరం..నెల్లిమర్ల..చీపురుపల్లి.. గజపతినగరం..బొబ్బిలి.. వీటితో పాటు మునుపు
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం కలిపితే, విజయనగరం పార్లమెంటు స్థానం. మరి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపి అభ్యర్థిగా ఎవరూ దొరకలేదా?
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి కలిశెట్టిని దిగుమతి చేయవలసిన దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు దాపురించిందో తెలుగుదేశం పార్టీకి..పోనీ అలా దిగుమతి చేసుకున్నప్పుడు..బిజెపి నేత పురంధేశ్వరి అయితే బాగుణ్ణు కదా…పోనీ గంటా శ్రీనివాసరావు..అదీ పోనీ..చీపురుపల్లి అసెంబ్లీలో కళా వెంకట్రావును నిలిపే బదులు. ఆయన్ని ఎంపి స్థానానికి ఎంపిక చేసి ఉంటే..ఆయన సీనియర్ నాయకుడు..ఆపై ఉత్తరాంధ్రలో అందరికీ సుపరిచితుడు.. కళాని లోక్ సభ బరిలో నిలిపి, నాగార్జునని చీపురుపల్లిలో నిలబెట్టి ఉంటే బాగుండేది కదా..అదీ చెయ్యలేదు.

ఇదంతా పోనీ..ఆర్ ఆర్ ఆర్ ని ఎక్కడో ఒక దగ్గర నిలబెట్టాలని తెలుగుదేశం గట్టిగా భావిస్తోంది..ఏం ఆయన్ని ఒప్పించి విజయనగరం తీసుకువస్తే.. అహ వస్తే గెలుపు అవకాశాలు బాగా మెరుగుపడి ఉండవా? అప్పుడు అసెంబ్లీ అభ్యర్థులకు కూడా బెనిఫిట్టే కదా.. అఫ్కోర్స్ ..అందుకు ఆర్ ఆర్ ఆర్ ఒప్పుకోవాలి అనుకోండి.. బాబు తలచుకుంటే అది జరగదా?
నిజానికి బాబు గట్టిగా పట్టు పట్టి ఉంటే, పోటీకి అశోక్ గజపతి రాజే ఒప్పుకునే వారేమో..అందుకే మొత్తం తప్పంతా బాబు మీదనే నెట్టవలసి వస్తోంది.

ఏ ,…లేక .. గతి అన్నట్టు అయింది మొత్తానికి విజయనగరం ఎంపి స్థానం..పాత కథలు పక్కనబెడితే నిన్న గాక మొన్న ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే విజయనగరంలో గెలుపొందిన దిగ్గజం అశోక్ గజపతి కేంద్రమంత్రిగా పనిచేసి పార్టీ గౌరవాన్ని..విజయనగరం పార్లమెంటు స్థానం విలువని పెంచారు.అలాంటి స్థానం ఇప్పుడు..ఇలా..ఏదో చింపిన విస్తరిగా మారిపోయింది.
ఇది ఖచ్చితంగా బాబు స్వయంకృతం..జనాలు మేం సైకిల్ ఎక్కుతాం.. రాండిరా బాబూ..అంటుంటే.. సైకిల్ గాలిలేదు..ఫ్యాన్ వేసుకుని ఇంట్లో కూర్చో అంటుంటే ఇక చేసేది ఏముంది..పళ్ళెంలో పెట్టి ఇవ్వడం మినహా..ఒక సీటు ప్రత్యర్థి స్వాహా..!

– సురేష్
జర్నలిస్ట్