Mahanaadu-Logo-PNG-Large

జగన్ భక్త ఐపిఎస్’లపై బాబు దృష్టి

– జాబితా ఇచ్చిన టీడీపీ సీనియర్ల బృందం
– జాబితాలో రాజేంద్రనాధ్‌రెడ్డి, పీఎస్సార్, రఘురామిరెడ్డి, సునీల్, సంజయ్, విజయారావు, విశాల్‌గున్నీ, వర్మ, పాలరాజు?
– జాషువా, రవిశంకర్‌రెడ్డి, విషాంత్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి కూడా?
– వీరిలో కొందరిని సర్వీసు నుంచి రిమూవ్ చేసే యోచన
– ఎన్నికల తర్వాత కూడా బాబుకు లుక్ అవుట్ నోటీసు ఇచ్చిన రఘురామిరెడ్డి
– దానితో బాబు దంపతులను ఆపేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు
– డీజీపీకి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
– దానితో రఘురామిరెడ్డికి ఫోన్ చేసి ఫైరయిన డీజీపీ గుప్తా?
– అర్ధరాత్రి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడిన రఘురామిరెడ్డి?
– మరుసటిరోజు లుక్‌అవుట్ నోటీసు వాపసు తీసుకున్న వైనం
– లుక్ అవుట్ నోటీసులో తన ఫోన్ నెంబరే ఇచ్చిన రఘురామిరెడ్డి
– ఐపిఎస్‌ల వేధింపులపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు
– వారికి ఎన్‌ఓసీలు ఇవ్వవద్దని ఆదేశాలు?
– వారిలో కొందరిపై విచారణకు రంగం సిద్ధం
– జెసి బ్రదర్స్‌పై దాడులు, రఘురామకృష్ణంరాజుపై వేధింపులు, తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో సంబంధం ఉన్న ఐపిఎస్‌లపై విచారణ?
– ఏపీపీఎస్సీ వ్యవహారంలో సవాంగ్‌పైనా విచారణకు అవకాశం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఐదేళ్ల జగన్ పాలనలో తమను పనిగట్టుకుని వేటాడి, వేధించిన కొందరు ఐపిఎస్ అధికారుల సంగతి తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా సీఎం చంద్రబాబునాయుడును కలిసిన టీడీపీ సీనియర్ల బృందం.. ఆ మేరకు చర్యలు తీసుకోవలసిన అధికారుల జాబితాను సమర్పించినట్లు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకోకపోతే క్యాడర్, లీడర్ల ఆత్మస్థైర్యం-ఆత్మగౌరవం దెబ్బతింటాని బాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. దానికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబునాయుడు.. మిగిలిన వారిని వివిధ కారణాల వల్ల వదిలిపెట్టినప్పటికీ.. పార్టీ నాయకులను అకారణంగా వేధించిన వారి పట్ల మాత్రం, కఠినంగానే వ్యవహరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వారికి ఎలాంటి ఎన్‌ఓసీలు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ డీజీపీ క సిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుతోపాటు సీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్, తాజా చీఫ్ సంజయ్, కాంతిరాణా తాతా, వర్మ, విజయారావు, విశాల్ గున్నీ, అమ్మిరెడ్డి, పాలరెడ్డి, జాషువా, రవిశంకర్‌రెడ్డి, విషాంత్‌రెడ్డిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. వీరిలో 30 సంవత్సరాల సర్వీసు దాటిన వారిని గుర్తించి, ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారం మేరకు వారి సేవలను సమీక్షించి, సర్వీసు నుంచి తొలగించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజేంద్రనాధ్‌రెడ్డి, పీఎస్సార్, సంజయ్, సునీల్ ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత వీరికి పోస్టింగులు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలన్న ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా జగన్ హయాంలో హద్దుదాటి వ్యవహరించి, ‘జగన్ దళం నాయకుడి’గా విమర్శలు ఎదుర్కొన్న, రఘురామిరెడ్డి వీరందరికంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పటి నుంచీ.. ఎన్నికలు ముగిసేవరకూ టీడీపీ నేతలే లక్ష్యంగా వేధించిన రఘురామిరెడ్డిపై, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈయన మోతాదుకు మించి జగన్‌కు విధేయత ప్రదర్శించడంతోపాటు, టీడీపీ నేతలను వేధించి జగన్ కళ్లలో ఆనందం కోసం పనిచేశారని, టీడీపీ సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రఘురామిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును వెన్నాడిన వైనంపై, అటు బాబు కూడా సీరియస్‌గా ఉన్నారట. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటన కోసం, రాత్రి వేళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు చంద్రబాబును నిలిపివేయడంతో, ఆయన ఖంగుతినవలసి వచ్చింది. కారణాలు ఆరా తీయగా.. రఘురామిరెడ్డి తన పేరు-ఫోన్ నెంబరుతోనే, చంద్రబాబుకు రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తేలింది. అంటే చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టుకు వస్తే, అరెస్టు చేసి తనకు ఫోన్ చేయాలన్నది ఆ సందేశ సారాంశం.

దానితో అగ్గిరాముడైన చంద్రబాబు అక్కడి నుంచే డీజీపీ హరీష్‌గుప్తాకు ఫోన్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో క్షమాపణ కోరిన డీజీపీ, ఆ అర్ధరాత్రి వేళ రఘురామిరెడ్డికి ఫోన్ చేసి కన్నెర్ర చేశారట. దానికి తత్తరపడిన రఘురామిరెడ్డి స్వయంగా ఎయిర్‌పోర్టు అధికారులకు ఫోన్ చేసి, ‘రెడ్‌కార్నర్ నోటీరు విత్‌డ్రా చేస్తున్న కాపీ రేపు పంపిస్తాను. చంద్రబాబును పంపించండి’ అని చెప్పడంతో, అధికారులు చంద్రబాబును అనుమతించారు.

ఈ ఘటన ఇప్పటికీ చాలామందికి తెలియదు. అయితే వైసీపీ అధికార సాక్షి పత్రికలో మాత్రం.. చంద్రబాబునాయుడు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారన్న కథనం రాసింది. అసలు అంత అర్ధరాత్రి వేళ, సాక్షికి ఆ సమాచారం ఎవరు ఇచ్చారని ఆరా తీస్తే.. అది కూడా ఆయన పనేనని తేలిందట.

ఇక జెసి ప్రభాకర్‌రెడ్డిని వేధించిన వ్యవహారం వెనుక పీఎస్సార్ ఉన్నారని, పోలింగు సమయంలో ఆయనతోపాటు రాజేంద్రనాధ్‌రెడ్డి ఎస్పీలకు ఆదేశాలిచ్చారన్న ఆగ్రహం టీడీపీలో ఉంది. వీరిద్దరూ ఎస్పీలు, డీఎస్పీలకు ఫోన్లు చేసి, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తున్నందున తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హెచ్చరించినట్లు టీడీపీ ఆఫీసుకు ఎన్నికల సమయంలో ఫిర్యాదులు వచ్చాయి.

ఇక ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టడీలో హింసించిన ఆధారాలున్నందున, సీఐడీ సునీల్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించవచ్చంటున్నారు. ఆ మేరకు రాజు గతంలో సునీల్‌పై చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై విచారణ జరపవచ్చంటున్నారు. ఎన్నికల సమయంలో ఓవరాక్షన్ చేసి, ఐపిఎస్ అధికారులసంఘం పేరుతో మీడియా-కూటమిపై విమర్శలు చేసిన, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాతాతాపైనా చర్యలు తప్పవంటున్నారు. ఇక ఏపీపీఎస్సీ అవకతవకలకు సంబంధించి నాటి కార్యదర్శి పీఎస్సార్, చైర్మన్ గౌతం సవాంగ్‌పైనా విచారణ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తిరుపతిలో చెవిరెడ్డి ఆదేశాలు పాటించడంతోపాటు, దొంగఓటర్ల నమోదుపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పరమేశ్వర్‌రెడ్డి.. పార్టీ ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి ధ్వంసం చేసినప్పటికీ, అలాంటిదేమీ జరగలేదని చెప్పిన ఐజి వర్మకూ తిప్పలు తప్పకపోవచ్చని టీడీపీతో పాటు, అటు పోలీసు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన ముగ్గురు అధికారులపైనా చర్యలు తప్పకపోవచ్చంటున్నారు.

కాగా అధికారం మారినందున తమపై చర్యలు తప్పవన్న భయంతో, ఇతర రాష్ట్రాలకు డెప్యుటేషన్‌పై వెళ్లేందుకు ప్రయత్నించకుండా ఉండేందుకు.. ఎవరికీ ఎన్‌ఓసీ ఇవ్వవద్దని, ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆ మేరకు సీఎస్‌కు స్పష్టమైన ఆదే శాలిచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, వీరిలో పలువురిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, మరికొందరిపై విచారణ కూడా జరపనున్నారు.