రాత్రికి, పగలుకు మధ్య..

– నాసా షేర్ చేసిన ‘టెర్మినేటర్’ చిత్రాలివి
(శివ శంకర్ చలువాది)

సూర్యకాంతి ప్రసరిస్తూ.. చీకట్లు వెనక్కిపోతున్న దృశ్యం.
రోజూ రెండు సార్లు జరిగే ప్రక్రియ … అంతరిక్షానికి, భూమికి మధ్య కాంతులతో అద్భుత చిత్రాలు.

వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లిపోతే రాత్రి..
ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం. మనకు ఇదే స్పష్టంగా కనిపించదు. కానీ ఆకాశం నుంచి చూస్తే.. వెలుగు, చీకట్ల మధ్య ఒక విభజన రేఖ కనిపిస్తుంది. భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇలా రాత్రిని, పగలును విభజించే రేఖను సాంకేతికంగా ‘టెర్మినేటర్’ అని పిలుస్తారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రించి.. భూమ్మీద దాదాపు అన్ని ప్రాంతాల్లో రోజూ రెండు సార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది. టెర్మినేటర్ రేఖ వాటిపై నుంచి కదులుతూ వెళుతుంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెర్మినేటర్ రేఖను నాసా చిత్రించింది. తాజాగా తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసింది.

అంతరిక్షానికి భూమికి మధ్య కాంతులతో..
ఈ చిత్రాల్లో.. అన్నింటికన్నా పైన నల్లని అంతరిక్షం.. దాని దిగువన నీలి రంగులో భూమి వాతావరణం.. దాని కింద భూమిపై పడి తెలుపు రంగులో ప్రతిఫలిస్తున్న కాంతి.. ఆ దిగువన బంగారు రంగులోని సంధ్యా సమయ కాంతి.. అన్నింటికన్నా కింద ఇంకా రాత్రి చీకటిలో ఉండి నలుపు రంగులో కనిపిస్తున్న భూమి కనిపిస్తున్నాయి.