భలే భలే సత్తిబాబు.. అయ్యో ఫాఫం జగన్‌బాబు!

– ఇప్పుడు ప్రతిపక్షనేత బొత్సనే
– ప్రకటి ంచిన మండలి చైర్మన్
– జగన్‌కు దక్కని ప్రతిపక్షనేత హోదా
– వైసీపీ ఫ్లోర్ లీడర్ పాత్రకే జగన్ పరిమితం
– ప్రోటోకాల్ జాబితాలో కనిపించని జగన్ పేరు
– ప్రోటోకాల్‌లో బొత్స పేరే ముందు
– సత్తిబాబుకు క్యాబినెట్ హోదా
– అసెంబ్లీ గేటులో ఎంట్రీకి బొత్సకే అనుమతి
– జగన్ కారు బయటనే
– జగన్ అధికార విలాపం
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాలం కలసి రాక పోతే తాడే పామై కరుస్తుందంటారు. ఐదేళ్ల పాటు అధికారదర్పం వెలగబెట్టి, అంతులేని అధికారం అనుభవించిన నేత.. అనంతరకాలంలో అసెంబ్లీ గేటులోకి కారులో వెళ్లలేని దయనీయం ఊహించుకుంటే ఎలా ఉంటుంది?.. అచ్చం జగన్‌లా ఉంటుంది! తాను టికెట్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్సీ దర్జాగా అసెంబ్లీ గేటులోకి ప్రొటోకాల్‌తో కారులో దూసుకుని వెళుతుంటే.. ఆయనకు టికెట్ ఇచ్చిన తాను మాత్రం గే టు బయటే దిగి, చేతులు పిసుక్కుంటూ, పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళితే ఎంత అవమానంగా ఉంటుంది? మరెంత నామర్దాగా ఉంటుంది? అచ్చం జగనన్నలా ఉంటుంది! ఇప్పుడు ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా సరిగ్గా అంతే ఉంటుంది. ఫాఫం జగనన్న!!

ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించి, పదికిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్‌లో వె ళ్లేంత రాజసం అనుభవించిన జగనన్న.. ఇప్పుడు ఇండిగో లాంటి విమానాల్లో ఆర్డినరీ క్లాసులో తిరుగుతున్న దుస్థితి. అలాంటి జగనన్నకు లేటెస్టుగా ఐదేళ్లకు సరిపడా మరో చేదు ఘటన ఎదురయింది.

ఇటీవల జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానితో ఆయనను శాసనమండలిలో పార్టీ నాయకుడిగా నియమించాలని, స్వయంగా జగనన్నే మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. అంతకుముందు గుంటూరు లేళ్ల అప్పరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. బొత్స ఎప్పుడైతే ఎమ్మెల్సీగా గెలిచారో, వెంటనే అప్పిరెడ్డి తన ప్రతిపక్ష నేత పద విని త్యాగం చేసి, బొత్సకు ఆ హోదా ఇచ్చేశారు.

ఇప్పుడు ఒకసారి వెలగపూడిలోని శాసనసభ-శాసనమండలికి వెళితే.. అసెంబ్లీలో 11 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ నాయకుడు. అంటే వైసీపీ ఫ్లోర్ లీడర్ అన్నమాట. ప్రతిపక్షనేత కాదు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా పనిచేశారు. ప్రతిపక్ష పాత్ర హోదా అంటే క్యాబినెట్ మంత్రితో సమానం అన్నమాట. ఆ ప్రకారంగా మంత్రికి దక్కే సౌకర్యాలన్నీ విపక్ష నేతకు దక్కుతాయి. ముఖ్యంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన కారు గేటు లోపలికి వెళ్లే వెసులుబాటు ఉండేది.

కారణం సంఖ్యాబలం. లేకపోతే చంద్రబాబునాయుడుకూ ఆ సౌకర్యం ఉండదు. బాబు దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ సెక్యూరిటీ ఉన్న ఏకైక నాయకుడు. అయినప్పటికీ, అసెంబ్లీ వ్యవహారాల్లో అది పనికిరాదు. కేవలం సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్ష నేత కారునే లోపలికి అనుమతిస్తారు. లేకపోతే సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా గేటు బయట కారు దిగి, ఫ్యాంటు జేబులో చేతులు పెట్టుకుని లోపలికి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో జగన్ జడ్ ప్లస్ క్యాటగిరిలో ఉన్నారు. అది బయట మాత్రమే. ఆ హోదా అసెంబ్లీ గేటులోపలికి వచ్చేందుకు పనికిరాదు. ఎందుకంటే.. హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినట్లు, జగన్ ఆఫ్టరాల్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు ఎలాంటి ప్రత్యేకతలూ లేవు. దట్సాల్!

మరి అదే జగన్ టికెట్ ఇచ్చి, ఎమ్మెల్సీగా గెలిపించిన బొత్స సత్యనారాయణ మాత్రం ప్రొటోకాల్ ఉన్న ప్రధాన ప్రతిపక్షనేత. ఆయన కారును అసెంబ్లీ గేటులోపలికి అనుమతించాల్సిందే. ఆయన క్యాబినెట్ ర్యాంకు ఉన్న నేత మరి! మంత్రులకు ఎన్ని సౌకర్యాలుంటాయో బొత్సకూ అన్ని సౌకర్యాలుంటాయి. ఎందుకంటే శాసనమండలిలో వైసీపీకి పూర్తిస్థాయిలో బలం ఉంది కాబట్టి!

మరిప్పుడు ఎవరు గొప్ప? తాను టికెట్ ఇస్తే గెలిచి, గేటు లోపలికి దర్జాగా కారులో వెళ్లే సత్తిబాబా? లేక 174 మందికి టికెట్ ఇచ్చి, 11 మందికి తానే లీడర్‌గా ఉంటూ.. స్పీకర్ దయాదాక్షిణ్యాల మీద, ఇప్పటివరకూ లోపలికి వస్తున్న జగన్ గొప్పవాడా? ఇదీ ఇప్పుడు సరికొత్త టాపిక్.

జగన్ కారును మొన్నటి అసెంబ్లీ సమావేశాల వరకూ లోపలికి వచ్చేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పెద్దమనసుతో దయతలచి అంగీకరించారు. అది కూడా పయ్యావుల అభ్యర్ధనతో. కానీ అది వచ్చే సమావేశాల్లో కుదరదు. ఎందుకంటే.. తన తోటి ఎమ్మెల్యే జగన్ కారును లోపలికి అనుమతించినప్పుడు, వై ప్లస్ సెక్యూరిటీలో ఉన్న తన కారును ఎందుకు అనుమతించరంటూ.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇప్పటికే అసెంబ్లీ సెక్యూరిటీని ప్రశ్నించారు. అంతేకాదు. తన కారును కూడా లోపలికి పంపించాలని ఆయన ఏకంగా స్పీకర్‌కు లేఖ రాశారు. దానితో నిజమేకదా అనుకున్న అయ్యన్న.. రఘురామరాజుతో ఎందుకొచ్చిన పంచాయితీ అనుకుని, ఆయన కారును లోపలికి అనుమతించాలని ఆదేశాలించాల్సి వచ్చింది.

దీన్ని బట్టి ఇకపై జరిగే అన్ని అసెంబ్లీ-కౌన్సిల్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా.. అందరి ఎమ్మెల్యేల మాదిరిగానే అసెంబ్లీ గేటు దగ్గర కారు దిగి, లోపలికి వెళ్లాలి. అదే సమయంలో.. మండలిలో ప్రతిపక్ష నేతగా జగన్ అవకాశం ఇచ్చిన బొత్స సత్యనారాయణ కారు, దర్జాగా లోపలికి వెళతుందన్నమాట. జగనన్న భాషలో చెప్పాలంటే.. దేవుడి స్కెచ్ ఇలాగే ఉంటుదేమోనన్నది రాజకీయ పండితుల ఉవాచ.