– ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్
గుంటూరు, మహానాడు: సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ బీజేపీ అని, సామాన్య కార్యకర్తకు అత్యున్నత స్థాయి కల్పించిన పార్టీ అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కార్యశాల అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాంప్రదాయ పద్దతుల్లో గతంలో సభ్యత్వ నమోదు చేసేవాళ్ళం. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సభ్యత్వ నమోదు చేస్తున్నాం. బీజేపీ సభ్యుల సంఖ్య కొన్ని దేశాల జనాభా తో సమానం.
మిస్డ్ కాల్, నమో యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా సభ్యత్వ నమోదు చేస్తున్నాం. 1984లో బీజేపీ నుండి ఇద్దరూ ఎంపీలు గెలిస్తే… కాంగ్రెస్ అవహేళన చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగింది. బీజేపీ సభ్యత్వాన్ని జిల్లా నాయకులు ఛాలెంజ్ గా తీసుకోని వీలైనంత ఎక్కువ గా చేయాలని కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు మన పార్టీ సిద్ధాంతాన్ని తెలియచేసి, అలాగే యువతను ఎక్కవ మందిని పార్టీ లోకి ఆహ్వానించి బీజేపీ కుటుంబంలోకి సభ్యులుగా చేర్చుకోవాలని అన్నారు.
బాపట్ల విద్యార్థులకు మెరుగైన వైద్యం
సమావేశ అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ… బాపట్ల కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిఎంహెచ్వో తో ఆదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై వెంటనే స్పందించి వైద్యులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. కొత్త మెడికల్ కాలేజ్ ల్లో ఫ్యాకల్టీ సమస్య ఎక్కువ ఉంది. ఎన్ఎంసి కొత్త మెడికల్ కాలేజ్ ల్లో అడ్మిషన్స్ అనుమతి ఇవ్వటం లేదు. అన్ని చర్యలు తీసుకొని అడ్మిషన్స్ వచ్చేలా చేస్తాం.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోస్తాంధ్ర జోన్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, జిల్లా ఇంచార్జి రామకృష్ణారెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ప్రముఖ్ పాలపాటి రవికుమార్, సహప్రముఖ్ చెరుకూరి తిరుపతిరావు, జిల్లా సంయోజక్ భీమినేని చంద్రశేఖర్, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ, కొక్కెర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్సులు కుమార్ గౌడ్, సుబ్బారావు, ఉమా మహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.