– కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తా…
– అత్యధిక మందికి సభ్యత్వం ఇచ్చేలా కృషి
– ప్రతీ కార్యకర్తకు బీమా సౌకర్యం
– విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
గొల్లపూడి, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు అయ్యే విధంగా బాధ్యత వహిస్తానని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సభ(కార్యశాల) కార్యక్రమం ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, మహేంద్ర నగర్, గొల్లపూడిలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదిగారి మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రారంభమైనది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుజనా చౌదరి మాట్లాడుతూ.. కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామని, అలాగే బిజెపి సభ్యత్వం తీసుకున్న వారికి బీమా పాలసీ వచ్చే విధంగా చేస్తామని ఆయన వివరించారు.
పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీకి గతంలో దేశ వ్యాప్తంగా 18 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని, రాష్ట్రంలో 37 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, అలాగే గతంలో ఎన్టీఆర్ జిల్లాలో లక్షా యాభై వేల సభ్యత్వాలు అయ్యాయని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయత్వంలో 60 లక్షల సభ్యత్వాలు, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో రెండు లక్షల యాభై వేల సభ్యత్వాల లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సభ్యత్వం స్వీకరించి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తారని, అలాగే సెప్టెంబర్ 2 వతారాఖున రాష్ట్రంలో పురందేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అలాగే బీజేపీ జిల్లాలో సెప్టెంబర్ 3 తారీఖున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అటల్ సభ్యత్వ నమోదు సంబరాలుగా నిర్వహిస్తామని, ఆయన వివరించారు.
ముఖ్య అతిథులుగా బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్ శ్రీ పాతూరి నాగభూషణం, వారధి ప్రోగ్రాం ఇన్‌చార్జి కిలారు దిలీప్, క్లస్టర్ ఇన్‌చార్జి శ్రీనివాస రాజు, పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ , సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, బబ్బూరి శ్రీరామ్, శ్రీధర్, సుబ్బయ్య, భగవాన్, ఆర్ముగం, రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.