– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్?
– ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర
– పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి
– తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం
– మళ్లీ ‘సంఘ’ వికాసం
– ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు
– మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ
– ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం
– కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి?
– పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, వినోద్ తారడే?
– 3 రాష్ట్రాల ఎన్నికల్లోగా నియామకం?
– ‘పుట్టుబీజేపీ’ కార్యకర్తల గుర్తింపు
– దేశవ్యాప్తంగా వారి పేర్లు నమోదు
– ఇక పార్టీ వారికే పదవులు
– వలస నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం
– దక్షిణాదిలో పుట్టుపార్టీ నేతలకే రాష్ట్రపార్టీ పగ్గాలు
– వలసనేతలకు జిల్లా అధ్యక్ష పదవులు
– సంఘ్ సుదీర్ఘ రాజకీయ ప్రణాళిక
– జార్ఖండ్ ‘టోలీ’ భేటీలో కీలక నిర్ణయాలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
దేశంలో పదేళ్లు ఎదురులేకుండా వెలిగిన పువ్వు పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో తగిలిన దెబ్బ.. మళ్లీ ఆ పార్టీని మూలాలకు తీసుకువెళ్లేందుకు కారణమయింది. ఇప్పటికే బీజేపీ అంటే మోదీ-అమిత్‌షాగా ఉన్న భావనను చెరిపేసి, మళ్లీ సంఘ్ భావజాలం దిశగా పార్టీని నడిపించేందుకు.. ఆ పార్టీ మార్గదర్శి ఆరెస్సెస్ జార్ఖండ్ వేదికగా సుదీర్ఘ ప్రణాళిలకు ఊపిరిపోసింది. ఆ ప్రకారంగా ఇకపై పార్టీలో వ్యక్తుల ప్రాధాన్యతకు తెరదించి, సంఘ సిద్థాంతాలకు ప్రాణం పోసే తిరుగులేని ప్రణాళికకు సంఘ్ నాయకత్వం తెరలేపింది. అందులో తొలి అడుగుగా, పార్టీలో కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
గత పదేళ్ల నుంచి మోదీ-అమిత్‌షా చుట్టూ తిరిగిన బీజేపీ.. ఇకపై పూర్తిస్థాయిలో ఆరెస్సెస్ అడుగుజాడల్లో నడవనుంది. అందుకు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన దెబ్బే కారణంగా కనిపిస్తోంది. ఆమేరకు ఇటీవల జార్ఖండ్‌లో మూడురోజుల పాటు జరిగిన ఆరెస్సెస్ ప్రముఖులతో కూడిన 15మంది ‘టోలి’ (టీమ్) సభ్యులు, వివిధ క్షేత్రాల ప్రముఖుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఆ ప్రకారంగా..పార్టీలు మారకుండా, తొలి నుంచీ నిబద్ధతతో పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల వివరాలు సేకరించాలని తీర్మానించారు. అందులో కొద్దిమేరకు ఆర్ధికబలం ఉన్న వారిని గుర్తించి, ఇకపై ఏ పదవులకైనా వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ఇన్చార్జిలను నియమించనున్నారు. ఆ డేటాబేస్ కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఇన్చార్జులే నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, పనిచేస్తున్న కార్యకర్తల వివరాలు నమోదు చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాగా గత పదేళ్ల నుంచి బీజేపీలో సర్వం తామై వ్యవహరిస్తున్న మోదీ-అమిత్‌షాల మనోభావాల మేరకు జరుగుతున్న, పార్టీ అధ్యక్ష నియామకాల పద్ధతిని సమూలంగా మార్చి.. ఎంపిక ప్రక్రియను ఎన్నికల ప్రక్రియగా మార్చడం ద్వారా, పనిచేసే కార్యకర్తలకు ఒక ఉత్సాహ సంకేతం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ-రాష్ట్ర అధ్యక్షులు-ముఖ్యమంత్రుల ఎంపికను.. ఇకపై సంఘ్ పూర్తిగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అంటే పదేళ్ల క్రితం మర్చిపోయిన ఆర్గనైజేషన్‌ను మళ్లీ పట్టాలకెక్కిస్తున్నారన్నమాట. అయితే ఈ ప్రక్రియ అటు మోదీకి సైతం అంగీకారయోగ్యమైన పద్ధతిలో నిర్వహిస్తారని సంఘ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకూ జాతీయ అధ్యక్షుల నుంచి, రాష్ట్ర అధ్యక్షుల నియామకాలన్నీ మోదీషా నిర్ణయం ప్రకారమే జరుగుతుండటంతో, సంఘ్ ప్రమేయం-ప్రాధాన్యం తగ్గిందన్న భావన బలపడింది. సంస్థాగతంగా కొన్ని సీట్లు-పలు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, సైద్ధాంతికంగా పార్టీకి నష్టం జరిగిందన్న భావనను గుర్తించింది. నిజానికి మోదీ-అమిత్‌షా రాకముందు పార్టీపై సంఘ్‌కు ఉన్న పూరితస్థాయి పట్టు.. వారిద్దరి రాకతో సడలిపోయి, అన్ని నిర్ణయాలూ వారిద్దరి మనోభావాల మేరకే జరుగుతుండంతో.. సంఘ్ పార్టీని శాసిస్తోందా? పార్టీనే సంఘ్‌ను శాసిస్తోందా? అన్న సైద్ధాంతిక చర్చ కూడా వివిధ క్షేత్రాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు దానిని సరిదిద్దడం ద్వారా.. మళ్లీ బీజేపీని కార్యకర్తల పార్టీగా మార్చాలన్న తపన సంఘ్‌లో కనిపిస్తోంది.
అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన రకరకాల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, తొలి నుంచీ పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం తగ్గిన ఫలితంగా, సంఘ్ భావజాలం ప్రజల్లోకి వెళ్లడం లేదని గ్రహించినట్లు సమాచారం. కొత్త నేతల రాకతో పాత నేతలంతా స్తబ్దతగా ఉండటంతోపాటు, తెరమరుగైన వాస్తవాలను గుర్తించింది.
సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించిన బీజేపీ.. ఫక్తు రాజకీయపార్టీ దిశగా వెళుతుండటంపై, ఆందోళన వ్యక్తమవుతున్న విషయాన్ని కూడా సంఘ్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్లనే.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి మనగుడ సాగించాల్సిన వచ్చిందన్న వాస్తవ భావన, జార్ఖండ్ ‘టోలి’ భేటీలో వ్యక్తమయినట్లు సమాచారం.
దానితోపాటు.. ఇటీవలికాలంలో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ, ఆరుగురు గుజరాతీలే దేశాన్ని నడిపిస్తున్నారంటూ.. తరచూ చేస్తున్న విమర్శలను సైతం గుర్తించిన సంఘ్.. అది కాంగ్రెస్ భవిష్యత్తులో బీజేపీపై చేసే యుద్ధ వ్యూహంగా గ్రహించింది. దేశాన్ని గుజరాత్ శాసిస్తోంది.
గుజరాత్‌ను దేశంపై రుద్దుతున్నారన్న అపప్రదకు తెర దించి, పార్టీకి మళ్లీ మునుపటిలా సైద్ధాంతిక సొబగులు అద్దేందుకు సంఘ్ నడుంబిగించింది. ఫలితంగా ఇకపై టీమ్ వర్క్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, పార్టీని మరో పదేళ్లు బతికించాలన్న లక్ష్యంతో ఆరెస్సెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా పార్టీలో ఇప్పటివరకూ లేని, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన పనితీరును బట్టి నవంబర్-డిసెంబర్‌లో రాజీనామా చేయనున్న నద్దా స్థానంలో నియమించాలా? లేక మరొకరి నియమించాలా అని నిర్ణయించ నున్నారు. ఆ ప్రకారంగా వినోద్ తారడే, సునీల్‌బన్సల్, యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలో ఒకరిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. త్వరలో జరగనున్న 3 రాష్ట్రాల ఎన్నికల్లోగానే వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించవచ్చంటున్నారు.
ఇక వివిధ పార్టీల నుంచి చేరిన నాయకులకు ప్రాధాన్యం తగ్గించి, తొలి నుంచీ పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్థయించింది. అయితే దక్షిణాదిలో మాత్రం ఇతర పార్టీల నుంచి చేరిన వారిని జిల్లా అధ్యక్ష పదవులకే పరిమితం చేసి, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మాత్రం తొలి నుంచీ బీజేపీలో పనిచేస్తున్న వారికే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల సంఘ్ సిద్ధాంతాల మేరకు పార్టీ నడుస్తుందే త ప్ప, ఫక్తు రాజకీయపార్టీ కోణంలో నడవదన్న అంచనా వ్యక్తమవుతోంది.
బహుశా ఈ కారణం వల్లనే.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక పెండింగ్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఈటల, ధర్మపురి అర్వింద్, డికె అరుణ పేర్లపై సంఘ్ ఆసక్తిచూపించడం లేదని, ఆర్గనైజషన్‌లో పనిచేస్తూ సంఘ మూలాలున్న వారికే పట్టం కట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా ఎప్పుడైనా అధ్యక్ష పదవిలో మార్పు ఉండవచ్చంటున్నారు.