పూడిమడక తీరంలో మరబోటు దగ్ధం!

– సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు

విశాఖపట్నం, మహానాడు: పూడిమడక సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోటు ఇంజన్లో మంటలు చెలరేగడంతో దగ్ధమైంది. బడే సూర్యనారాయణకు చెందిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం 294 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్ళింది. శనివారం వేట సాగించాక ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒకసారిగా ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, మంటలు ఆరకపోవడంతో వారంతా సముద్రంలోకి దూకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటూ ఈదుకొంటూ వస్తున్న సమయంలో 683 నెంబర్ గల శ్రీనివాసరావుకు చెందిన బోటు తారసపడడంతో ఆ బోటు ఎక్కి ఆదివారం ఉదయం వారంతా ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అధికారులు, పోలీసులతో మాట్లాడి మత్స్యకారులకు చేయూత ఇవ్వాలని కోరారు.

ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారుల్లో జి.ఎల్లాజీ, జి.రాము, బి.ధనరాజు, ఆర్.ఎర్రయ్య, గరికిన ఎల్లాజీ, పి.వీరాస్వామి, సీహెచ్ నల్లోడు ఉన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర మరపడవల సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ బోటు ఇంజన్లో మంటలు చెలరేగుతున్న సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన మత్స్యకారులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సముద్రంలోకి దూకి మరో బోటులో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు.

బోటు ఓనర్, మత్స్యకారులకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు. కాలిపోయిన బోటుకు పరిహారం వెంటనే ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మత్స్యశాఖ, అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. బోటు ఖరీదు 35 నుండి 36 లక్షలు ఉంటుందని అది అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మరపడవల సంఘం ఉపాధ్యక్షుడు గరికిన పరుశురాం, కార్యదర్శులు ఎస్. గురుప్రసాద్, మున్నం బాలాజీ, 37వ వార్డు జనసేన అధ్యక్షులు గరికిన రవి, ఎమ్మెల్యే ప్రతినిధి మద్దాడ భాను తదితరులు పాల్గొన్నారు.