తాత్కాలికంగా తొలగించిన రోడ్ల స్థానంలో బాక్స్ కల్వర్ట్లు

– మంత్రు జనార్దన్‌ రెడ్డి, నారాయణ సన్నాహాలు

అమరావతి, మహానాడు: సచివాలయంలో రోడ్లు, రవాణా, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో గురువారం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు మంత్రుల భేటీ సందర్భంగా విజయవాడ నగర పరిధిలో గత నెలలో బుడమేరు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్ & బీ రోడ్లు మునిగిపోయిన అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా నాడు నూజివీడు వెళ్లే రోడ్డును పలు చోట్ల తాత్కాలికంగా తొలగించి, వరద నీటిని బయటకు విడుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఆ రోడ్డును పునర్ నిర్మించడం జరిగింది. అయితే, భవిష్యత్తులో వరదల సమస్య పునరావృతం అయితే, వాటికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే ఆలోచనతో మంత్రులు చర్చించారు.

తాత్కాలికంగా తొలగించిన రోడ్ల స్థానంలో బాక్స్ కల్వర్ట్లు నిర్మించేందుకు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖతో, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చేసుకుని ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరువురు మంత్రులతో పాటు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.