బ్రాహ్మణ కార్పోరేషన్ నిర్వీర్యం

– చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సీడీ, పావలా వడ్డీకే రుణం, రిబేట్ స్కీమ్ ఈ ప్రభుత్వంలో నిలిపివేశారు
– రాజాంలో యువనేత లోకేష్ కు వినతుల వెల్లువ
– సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ

రాజాం: రాజాం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుసుకువచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పారా మెడికల్ విభాగం నందు గత 21 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్స్ మేల్ పోస్టులు భర్తీ చేయాలని ఆ విభాగం నిరుద్యోగులు యువనేతకు విన్నవించారు.

ప్రస్తుత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేశారని, టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక తగినన్ని నిధులు ఇచ్చి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు తమ సమస్యలను విన్నవిస్తూ.. చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సీడీ, పావలా వడ్డీకే రుణం, రిబేట్ స్కీమ్ ఈ ప్రభుత్వంలో నిలిపివేశారని వాపోయారు. రాజాంలో 120 సొసైటీ మగ్గాలు ఉంటే కేవలం 5గురికి మాత్రమే నేతన్ననేస్తం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ ప్రభుత్వం వచ్చాక చేనేతలను ఆదుకోవాలని ఆ సామాజిక వర్గం ప్రతినిధులు యువనేతకు విన్నవించారు. రాజాం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో తెలగ కులస్థులను బీసీల్లో చేర్చాలని ఈ ప్రాంత తెలగ కులస్థులు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. రాజాం నియోజకవర్గ సర్పంచ్ లు యువనేతకు సమస్యలు విన్నవిస్తూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ నిధులను దారిమళ్లించారని, దీంతో గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.

విద్యుత్ ఛార్జీల పేరుతో సర్పంచ్ ల ప్రమేయం లేకుండానే తమ నిధులను ప్రభుత్వం లాగేసిందని తెలిపారు. గ్రామ వాలంటీర్ల జోక్యం వల్ల సర్పంచ్ లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత లోకేష్ స్పందిస్తూ.. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు, విధులు కల్పించి.. సర్పంచ్ ల గౌరవం పెంపొందించేలా చర్యలు చేపడతామని అన్నారు.

అదేవిధంగా చేనేతలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాపు, తెలగలను బీసీల్లో చేర్చే విషయంపై గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటామని యువనేత లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ అసిస్టెంట్స్ మేల్ అభ్యర్థుల సేవలను వచ్చే ప్రభుత్వంలో వినియోగించుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు.