బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది. టీటీడీ గురువారం ఈ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది.

అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రాకపోకలపై నిషేధం..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ.. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనుంది..