-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మహానాడు: నల్గొండపై బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని, కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ ప్రజలంటే ఎందుకు అంత కోపం..? మానవత్వం మరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా వ్యవహరించడం తగదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మూసీ కాలకూట విషంపై అపోహలుంటే మీ మాజీ ఓఎస్డీ ని అడిగి తెలుసుకోండి. మాది బుల్డొజర్ పాలన కాదు.. ప్రజాపాలన. మూసీ సుందరీకరణతో పాటు శుద్ధీకరణ చేస్తున్నాం. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతుంటే రాక్షసానందం పొందుతున్న కేసిఆర్ ఫ్యామిలి. నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ.. రాజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తది. మూసీ పై నాది దశాబ్ధాల పోరాటం.. నల్గొండ పట్ల అంత అమానవీయత ఎందుకు.. ?
ఈసారి అసెంబ్లీకి కేసిఆర్ వస్తే నల్గొండ సమస్యలపై నిలదీస్తాం. మూసీ ప్రక్షాళన పేరుతో కార్పొరోషన్ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ శాసన సభ్యున్ని ఛైర్మన్ చేసిన కేసిఆర్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.
మూసీ సుందరీకరణ మాత్రమే కాదు కోట్లమంది బతుకులను కాలుష్యం నుంచి కాపాడే శుద్ధీకరణ. నేను ఇప్పుడు కాదు రెండు దశాబ్ధాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నాను. ప్రధానితో పాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుద్ధీకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చా. నేను తిరగని ఇళ్లు లేదు, నేను కేంద్రంలో కలవని నాయకుడు లేడు. వాళ్లు మూసీ బాధితులను తెలంగాణ భవన్ కు పిలిపించుకొని జనతాగ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నరు. మీదీ జనతా గ్యారేజ్ కాదు.. జనాన్ని ముంచే గ్యారేజీ, జనాల్ని వంచించే గ్యారేజీ.. అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమైంది.