స్వల్పంగా పెరిగిన బుడమేరు వరద

– ఆందోళన వద్దన్న మంత్రి నారాయణ

విజయవాడ, మహానాడు: బుడమేరు వరద మరోసారి స్వల్పంగా పెరగడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు శుక్రవారం జలమయమయ్యాయి. సింగ్ నగర్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి, బాధితులతో మాట్లాడారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ధైర్యం చెప్పారు. గండి పూడ్చిన 12 గంటల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నీరు తగ్గిన వెంటనే పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. కాగా, బాధితులకు అందుతున్న ఆహారం, నిత్యావసరాల సరఫరా పై మంత్రి ఆరా తీశారు. అలాగే, అయోధ్య నగర్ లో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు.