జగన్‌ వల్లే ఉపద్రవం!

– ఐదేళ్ళ పాలనలో బుడమేరును గాలికొదిలేశారు
– ఎమ్మెల్యే చదలవాడ ఆరోపణ

విజయవాడ, మహానాడు: విజయవాడకు వరదలపై కేసులు నమోదు చేయాల్సి వస్తే ఏ 1 నుండి చివరి నిందితుడి వరకు జగన్ రెడ్డే ఉంటారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు 45వ డివిజన్లో వరద సహాయక చర్యల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో పాల్గొన్నారు. సితార కూడలి, జోజినగర్, కబేళా సెంటర్ తదితర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేశారు. ఆహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు, కూరగాయలు, బియ్యం నిత్యావసర సరకులు, వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది చొరవ తీసుకోవాలని కోరారు. ముంపు బాధితులతో నేరుగా మాట్లాడి అందుతున్న సాయం, దాని పై వారి సంతృప్త స్థాయిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో రూ.400 కోట్లతో బుడమేరు విస్తరణ, కృష్ణా నదితో అనుసంధాన పనుల్ని చేపడితే…రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రెడ్డి ఆ పనుల్ని నిలిపివేశారన్నారు. వైసీపీ ల్యాండ్ మాఫియా మొత్తం రంగంలోకి దిగి బుడమేరు మొత్తాన్ని ఆక్రమించుకుని, కట్టల్ని గాలికొదిలేశారన్నారు. మరోవైపు వల్లభనేని వంశీ లాంటి వారు.. బుడమేరు కట్టల మట్టిని కూడా తవ్వుకుని అమ్ముకున్నారన్నారు. వరదలు వచ్చిన ప్రతి సారీ హెలికాప్టర్లో వెళ్ళి లోపల సెల్ఫీలు తీసుకునే జగన్ రెడ్డి.. ప్రజాక్షేత్రంలో నిలిచి పని చేస్తున్న చంద్రబాబును విమర్శిస్తే సహించమని ఆయన హెచ్చరించారు.