– యూపీ మంత్రికి చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: రైతుల అభ్యున్నతికి రాష్ట్ర బడ్జెట్ లో సింహాభాగం కేటాయించామని, అలాగే రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహి కి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రాష్ట్ర పర్యటనకు బుధవారం వచ్చిన ఉత్తరప్రదేశ్ మంత్రిని మంత్రి తుమ్మల ఐటీసీ కోహినూర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. తమ ప్రభుత్వం ప్రైవేట్, పబ్లిక్ రంగంలో విత్తనోత్పత్తి సంస్థలను భారీగా ప్రోత్సహిస్తోందని, తద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలో ఆయిల్ పామ్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలబెడుతామని మంత్రి అన్నారు.
ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి షాహి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తమ రాష్ట్రంలో 9 వ్యవసాయపరంగా జోన్లు ఉన్నాయని, చెరకు పంటలో యాంత్రీకరణ తీసుకురావడం, చక్కెర కర్మాగారాలను భారీ ఎత్తున ఆధునీకరించడం ద్వారా రైతుల నికర ఆదాయాన్ని పెంచామని తెలిపారు.
కానీ చెరకు పంట సాగులో తమ ప్రభుత్వానికి నీటి నిర్వహణ ఖర్చు ఎక్కువ కావటం, విద్యుత్ ను అధిక మొత్తంలో వినియోగించటం చేత పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందర్, కమిషనర్ గోపి, ఉత్తరప్రదేశ్ సీఎం సలహాదారు అవనీష్ కే అవస్తి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవీందర్ పాల్గొన్నారు.