ప్రశాంత కౌంటింగ్‌ చర్యలు చేపట్టాలి

-జూన్‌ 4న రాష్ట్రమంతటా 144 సెక్షన్‌
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా
-నరసరావుపేటలో డీజీపీతో కలిసి స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలన

నరసరావుపేట, మహానాడు: పల్నాడు కలెక్టర్‌ కార్యాలయంలోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు లో మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఎన్నికల కౌంటింగ్‌ సన్నద్ధత, శాంతి భద్రతల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాత్కర్‌, ఎస్పీ మల్లికా గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముకేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంగా జూన్‌ 4న రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ ఉం టుందని తెలిపారు. ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకాని జేఎన్‌టీయూ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. టీడీపీకి చెందిన ఏజెంట్‌ను ఏర్పాట్లు, బందోబస్తుపై ఆరా తీశారు. కౌంటింగ్‌ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి గుర్తింపు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినా యకం, రెవెన్యూ డివిజనల్‌ అధికారి సరోజ ఉన్నారు.

సీఈవో, డీజీపీని కలిసిన అధికారులు
అంతకుముందు తొలిసారి పల్నాడుకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాత్కర్‌, ఎస్పీ మల్లికాగార్గ్‌, జేసీ శ్యాంప్రసాద్‌, డీఆర్వో వినాయకం, ఆర్డీవో సరోజ మర్యాద పూర్వకంగా కలిశారు.