– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
రాజమండ్రి, మహానాడు: రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని, ఇందులో విదేశీ కుట్ర దాగిందని, ఆర్ఎస్ఎస్, బిజెపి భాగస్వాములని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఆ వివరాలు.. సెబీ స్కామ్ లో తప్పులు లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. పీవీ హయాంలో సెక్యూరిటీ స్కామ్ ఆరోపణలు వస్తే, ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు.
అదాని కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన జబర్దస్త్ గా ఉంది. ఆయన (చంద్రబాబు ) టిడిపి, నేను (చింతామోహన్ ) కాంగ్రెస్ అయినప్పటికీ మా మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ చంద్రబాబును అభినందించక తప్పదు. కాపు, బలిజలు ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతారు. కాపు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నాకు సంతృప్తిగా లేదు. కాపు బలిజల్లో కసి, పట్టుదల ఉండాలి. అది ఉంటే ఏదో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
జిల్లా కలెక్టర్లుగా, జిల్లా ఎస్పీలుగా ఎస్సీ అధికారులను నియమించకపోవడమే ఎందుకు నిదర్శనం. బిజెపి ది విభజించు పాలించు సిద్ధాంతం. అందులో భాగంగానే వర్గీకరణ తీర్పు. తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూల వాదనలు చేశారు. వెనుకబడిన వర్గాలు దేశంలో 60 కోట్ల మంది ఉంటే, ముగ్గురే సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఉంటే సుప్రీం జడ్జిగా ఒకరే ఉన్నారు. 34 మంది సుప్రీం జడ్జిల్లో ఒకే సామాజిక వర్గం వారు 20 మంది ఉన్నారు. 5000 సంవత్సరాలుగా అంటరానితనం భారతదేశంలో ఉన్నది. సౌత్ ఆఫ్రికా దర్బార్లో మహాత్మా గాంధీ అంటరానితనం గురించి తెలుసుకొని, బెజవాడ వచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నారు. కేరళ నుంచి కన్యాకుమారి వరకు గాంధీ పాదయాత్ర చేశారు.
ప్రతి దగ్గర ఐదు నిమిషాలు గాంధీ మాట్లాడారు. అంటరానితనం, హరిజనోద్ధరణ, దేశానికి స్వతంత్రం గురించి మాత్రమే గాంధీ ప్రస్తావించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరోజు హరిజనులు, నేడు దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నెహ్రూకి గాంధీ చెప్పారు. బెజవాడకు చెందిన చక్రయ్యను దేశానికి తొలి రాష్ట్రపతిని చేయాలని గాంధీ కోరుకున్నారు. అనారోగ్యంతో చక్రయ చనిపోవడంతో, అది నెరవేరలేదు. 10 లక్షల కోట్లు జగన్ అప్పులు తెచ్చారు.
తెచ్చిన అప్పులు ఏ జిల్లాకు ఎంత ఖర్చు చేశారు? ఆ వివరాలు బయటపెట్టాలి. ముఖ్యమంత్రికి నెల రోజులు గడువిస్తున్నా… ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేయకుంటే, నేనే ఆ వివరాలు బయటపెడతా… నాకు తెలుసు ఆ వివరాలు ఎలా రాబట్టాలో! తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రాలో ఒక కుటుంబం వల్ల రాష్ట్ర విభజన జరగడమే కాదు, తెలుగు వాళ్ళ ప్రతిష్ట, ఆత్మగౌరవం దెబ్బతింది.