ప్రజాపాలన రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి

– దిన్నెహట్టి గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, దీనికి గ్యారెంటీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన భువనేశ్వరికి గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టారు. చేయని నేరానికి రూ.3వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు..అనంతరం రూ.3వందల కోట్లు అన్నారు..ఆ తర్వాత రూ.3కోట్లు అన్నారు..కానీ చంద్రబాబు ఒక్క రూపాయి దోచుకున్నట్టు జగన్ ప్రభుత్వం ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపలేకపోయారు.

చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం చేసే అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదనేలా వైసీపీ ప్రభుత్వ తీరు కనిపిస్తోంది.ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ప్రజాపాలన రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. దీనికి రాష్ట్ర ప్రజలు తమ ఓటును ఆయుధంగా వాడాలి. ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఓటుతో ఇంటికి సాగనంపాలి…అన్నారు.