-ఓటమి భయంతో జగన్ లో ఫ్రస్టేషన్
-అధికారం కోసం నాడు జగన్ ముద్దులు…నేడు గుద్దులు
-పెట్రోల్, డీజిల్, విద్యుల్ ఛార్జీలన్నీ బాదుడే బాదుడు
-సంపదంతా తన వద్దే ఉండాలనే భావనలో జగన్
-పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తా
-జగన్ మద్యం దందాలో నీ వాటా ఎంత పెద్దిరెడ్డి.?
-అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా
-ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా…అండగా ఉంటా
-కుప్పం తో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తా
-ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యేగా చల్లా బాబును గెలిపించాలి
-పుంగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
పుంగనూరు : అధికారం కోసం జగన్ నాడు ముద్దులు పెట్టి…ముఖ్యమంత్రి అయ్యాక జనాన్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు అన్నీ బాదుడే బాదుడు అన్నారు. పుంగనూరు ప్రజాగళం మంగళవారం చంద్రబాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ….‘‘మేం పొత్తు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం. కానీ గతంలో జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తు మంచిదా, చీకటి ఒప్పందం చేసుకోవడం మంచిదా? కేసుల కోసమే జగన్ ఒప్పందం చేసుకున్నావు…మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధితో పాటు సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నాం.
జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడు
పెద్దిరెడ్డి రకం అయితే…ఇంకో రకం సైకో జగన్. జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఒకసారి తండ్రిలేని బిడ్డను అన్నాడు…రెండో సారి ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచేశాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆస్తి పన్నును ఇష్టానుసారంగా పెంచాడు. ఆఖరికి ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి జగన్. 2019లో కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. దెబ్బ తగులుతుంది కానీ రాయిమాత్రం కనబడదు. డ్రామాలతో ఎన్ని రోజులు, ఎంతమందిని మోసం చేస్తావు?
నార్సీ విధానం తీసుకుని హిట్లర్ లాగా అవ్వాలనుకుంటున్నాడు. ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు..జగన్ కిమ్ కు బ్రదర్. కిమ్ కు ఎవరూ ఆనందంగా ఉండకూడదు…ఎవరి దగ్గరా డబ్బుండకూడదు. సంపదంతా అతని దగ్గరే ఉండాలి. జగన్ ఇప్పుడు క్లాస్ వార్ అంటున్నాడు.. క్లాస్ వార్ కాదు జగన్ …ఇది క్యాష్ వార్. ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సిన డబ్బంతా జగన్ దగ్గర, పెద్దిరెడ్డి దగ్గరే ఉంది. జూన్ 4 తర్వాత ఆ డబ్బంతా కక్కించి పేదలకు పంచుతా.
పుంగనూరు ప్రజలకు నేడు స్వాతంత్ర్యం వచ్చింది
‘‘ప్రజాగళం సభకు వచ్చిన ఈ జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లింది. పుంగనూరు ప్రజలకు ఈ రోజే స్వాతంత్ర్యం వచ్చింది…రాబోయే రోజులు అన్నీ మంచిరోజులే. రాష్ట్రంలో, పుంగనూరులో గెలిచేది మనమే. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు. చల్లా బాబు ఓ బుల్లెట్ లాగా దూసుకెళతారు. రామచంద్రారెడ్డీ మిడిసిపడుతున్నావు. అసలు నీకు….కిరణ్ కుమార్ రెడ్డికి పోలిక ఉందా? నల్లారి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే…ఒకటి నేను, రెండో వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.’’ అని అన్నారు.
పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తా
పాపాల పెద్దిరెడ్డీ… నువ్వు మంత్రివి, నీ కొడుకు మిథున్ రెడ్డి ఎంపీ, నీ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే. ప్రజలు, మేము నీకు బానిసలం అనుకుంటున్నావా? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరుబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ప్రజలే పెద్దిరెడ్డి కొమ్ములు విరచాలి. పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబం రాజకీయ ఆధిపత్యానికి గండికొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం ఖాయం. దేశ ప్రదానిగా మళ్లీ మోదీ అవుతారు. పాపాల పెద్దిరెడ్డీ ఇక నీకు నిద్ర ఉండదు. ఎన్డీయే అంటే అభివృద్ధి… వైసీపీ అంటే అవినీతి అని సోమవారం నాడు మోదీ అన్నారు. అవినీతికి ఆద్యుడైన పాపాల పెద్దిరెడ్డి ఇక్కడే ఉన్నాడు.
పాడి, మామిడి రైతులను దోచుకున్నారు
పెద్దిరెడ్డి కుటుంబానికి బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి భూస్థాపితం చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. పెద్దిరెడ్డి మంత్రి… దోపిడీ కోసమే పెద్దిరెడ్డి మంత్రి అయ్యాడు. తన శివశక్తి డెయిరీకి పోటీగా మరో డైయిరీలను పుంగనూరుకు రానివ్వడం లేదు. పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి కుటుంబం అబ్బ సొత్తా? రైతులు పండించే మామిడికాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు. ఆవులాపల్లి రిజర్వాయర్ కు అసలు అనుమతులు ఉన్నాయా? ఈ ప్రాజెక్టును కాంట్రాక్టుకు తీసుకుంది తన కంపెనీ పీఎల్ఆర్. రైతుల పొట్టగొట్టి వాళ్లను ఆ ఊరి నుంచి తరిమేయాలనుకుంటున్నాడు. మంత్రులు, ఎంపీలు, కాంట్రాక్టర్లు మైనింగ్ దోచేది, ఇసుక వ్యాపారం చేసేది, మద్యం వ్యాపారం నడిపేది వీళ్లే. ఏమీ మిగల్చకుండా మొత్తం ఊడ్చేశారు.
పుంగనూరులో అలజడి లేని రోజు
నా సొంత నియోజకవర్గంలో కుప్పంలో గ్రానైట్ కొట్టేశారు. ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించాడు. విద్యుత్ శాఖా మంత్రిగానూ పెద్దిరెడ్డే ఉన్నాడు. ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయా…లేదా.? విద్యుత్ చార్జీలు పెరగడానికి ఈ పెద్దిరెడ్డి, జగన్ రెడ్డే కారణం. పుంగనూరులో దాడులు, అలజడి లేని రోజంటూ లేదు. అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్ట్ జరగని రోజు లేదు. 600 మంది కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు.
ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా
పుంగనూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఎంపీగా ఉన్నంత వరకూ అన్యాయం జరగదు. పేదలకు న్యాయం చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి ముందుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే నాకు గౌరవం. ఎస్సీల కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టం చేసి అమలు చేశారు. సీఏఏ బ్రహ్మాండంగా ఉందని ఢిల్లీలో మిథున్ రెడ్డి అన్నాడు…రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు చేస్తాడు.
టీడీపీ జనసేన ఎన్డీయేలో చేరాక ఏదో జరిగిపోతోందని కబుర్లు చెప్తున్నారు. మైనారిటీలకు, ముస్లింలకు న్యాయం చేసింది టీడీపీనే. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు నేను కాపాడతా. ఉర్దూను రెండో అధికార భాష చేశాను, ఉర్దూ యూనివర్సిటీ తీసుకువచ్చాను. షాదీ ఖానాలు కట్టించాం, దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమామ్ లు, మౌజన్ లకు, మసీదులకు ఆర్థికసాయం చేశాం.
కేసుల కోసం జగన్ చీకటి ఒప్పందం
రాష్ట్రం కోసం మేం పొత్తు పెట్టుకుని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నాం. కానీ నాడు జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాష్ట్రం కోసం పొత్తు మంచిదా, చీకటి ఒప్పందం మంచిదా? కేసుల కోసం జగన్ ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నాం. పొత్తునకు చొరవ చూపింది పవన్ కల్యాణే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను రాజమండ్రి జైల్లో ఉంటే నన్ను కలిసి పొత్తు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మిథున్ రెడ్డి పిఠాపురం వెళతాడంట. ఇంట్లో వేగలేవు కానీ… బయట మాత్రం ప్రగల్భాలు పలుకుతారు. ఇక్కడి జనసైనికులు గ్లాసుకు పదును పెట్టాలి. పుంగనూరులో జనసేన అభ్యర్థి లేకపోయినా పవన్ కల్యాణ్ స్ఫూర్తి మీలో ఉంది. జనసేన కార్యకర్తలు, జనసైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలందరిదీ ఒకటే ఆలోచన…ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించాలి…పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. చల్లా బాబు చేతిలో పెద్దిరెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడు.
కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తా
పుంగనూరులో చల్లా బాబును గెలిపించండి…కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తాం. నేను సీఎం అయ్యాక రాజముద్రతో రైతులకు పాస్‌పుస్తకం ఇస్తాను. పుంగనూరులో ఉర్దూ గురుకుల జూనియర్ కళాశాలను నిర్మిస్తాం. చింతపండు రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఎన్నికలు సజావుగా జరగాలి. భయపడొద్దు. ఎన్నికల కమిషన్ అన్ని గమనిస్తోంది.
స్థానిక పోలీసులే కాదు, కేంద్ర బలగాలు కూడా ఉంటాయి. దౌర్జన్యాలకు పాల్పడేవారి మక్కెలు విరగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛ ఇస్తారు. ఉద్యోగస్థులకు ఓటు బ్యాలెట్ వేయమని వైసీపీ నాయకులు రూ.5 వేలు ఇవ్వబోయారు. మీ పాపిష్టి డబ్బులు మాకొద్దని తిప్పి నేరుగా పోయి ఓటేసి మన దగ్గరకొచ్చి పది వేల రూపాయలిచ్చి గట్టిగా పని చేయండని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపమని చెప్పి ఉద్యోగస్థులందరూ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. ఉద్యోగుల్లో ఇంత కసి ఉందని ఊహించలేదు. వారి కంటే ఎక్కువ కోపం ప్రజలకుంది. పాపాల పెద్దిరెడ్డికి మళ్లీ లైసెన్స్ ఇవ్వొద్దు. ఇక్కడే రాజకీయంగా భూస్థాపితం చేయాలి. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటాను.’’ అని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.