త్వరలో క్యాడర్‌ దగ్గరకు చంద్రబాబు!

– టీడీపీ అధినేత సంచలన నిర్ణయం
– సిద్ధమవుతున్న రోడ్‌ మ్యాప్‌

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంధ్రా క్యాడర్‌కు ఇది శుభవార్త! త్వరలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను, నేతలను కలవనున్నారు. ఈ మేరకు అధిష్ఠానం సంచల నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై పార్టీ క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. అటువంటి నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి సారించి చర్యలకు సిద్ధమవుతోంది.

సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో మండలాల వారీగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను గుర్తించి త్రీమెన్ కమిటీలు వేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆర్ధికంగా అండగా నిలిచారు? ఏ నాయకుడు ఎంతమేర పార్టీ కోసం పనిచేశారు? అనేది పూర్తి సైంటిఫిక్ డేటా అధినేత తన వద్ద ఉంచుకుని అంతర్గతంగా సమీక్షిస్తున్నారు. దీంతో సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఝలక్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ నాయకుడిని, కార్యకర్తని పార్టీకి దూరం కానివ్వడానికి వీలు లేదు అని, ఏ స్థాయి నాయకుడికి అయినా నష్టం జరగడానికి వీలు లేని విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది.

2014-2019 మధ్య తరహాలో శాసన సభ్యుల మీద పార్టీని వదిలేసి నష్టపోయిన పరిస్ధితి ఏర్పడింది. మరలా అదేవిధంగా వ్యవహరిస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు, అక్రమ సంపాదన, క్యాడర్ ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలతో రాబోయే ఎన్నికలలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అని భావించి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి కనుక ఎమ్మెల్యే వలన ఇబ్బంది పడుతున్నాం అని గాని, ఏదైనా సమస్య ఎమ్మెల్యే పరిధిలో ఉన్నప్పటికీ కూడా పరిష్కరించలేకపోవడం, కొన్ని చోట్ల కార్యకర్తలు ఆగ్రహాలతో కట్టలు తెంచుకోని రోడ్లపైకి రావడం, మీడియా ముందు వారి ఆవేదన వెలిబుచ్చడం వంటి వాటి గురించి ఆయా ఎమ్మెల్యే లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోలేకపోవడం వలనే కదా వారు ఇక్కడకు వచ్చి వేడుకుంటున్నారని అంటున్నారు. దీని పై ఆయా ఎమ్మెల్యే లను ఉద్దేశించి “ఇంత అసమర్ధంగా ఉన్నారా, ఒంటెద్దుపోకడ మంచిది కాదు అని ఆ ఎమ్మెల్యేలపై అధినేత ఆగ్రహిస్తున్నారు. రాజకీయాలలో భేదాబిప్రాయాలు ఉండటం సహజం, వాటిని చర్చించుకోని సమన్వయం చేసుకోవాలి, అంతే కానీ క్యాడర్ ను గాలికి వదిలేస్తా అంటే అధిష్ఠానం చూస్తూ ఊరుకోదు అని కొందరు సీనియర్ నేతలకు బాబు చురకలు అంటించారు.