ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు సవతి ప్రేమ

-తల్లికి వందనం పథకంలో చంద్రబాబు వంచన
-ఉచిత ఇసుక బూటకం
-ఈ ప్రాంతానికి ఆయన ఏనాడూ న్యాయం చేయలేదు
-మా హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు
-వాలంటీర్లపై మీ వైఖరి ఏమిటి?
-మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి, తల్లికి వందనం పేరుతో పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు, గత ఎన్నికల ముందు విపరీతంగా ప్రచారం చేశారని, ఒక కుటుంబంలో ఎందరు పిల్లలున్నా అందరినీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారని మాజీ మంత్రి అమర్‌నాథ్‌ గుర్తు చేశారు.

కానీ ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన 29 నెంబరు జీవోను చూస్తే.. ఆ హామీ అమలుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రతి పిల్లాడికి అని కాకుండా, ప్రతి తల్లికి రూ.15 వేల చొప్పున జమ చేస్తామన్నారని, దీంతో ఒక కుటుంబంలో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పథకాన్ని వర్తింపచేసే కుట్ర కనిపిస్తోందని అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ ఉత్తరాంధ్రకు మేలు చేయలేదని, ఆయన ఈ ప్రాంతంపై సవతిప్రేమ చూపారని వైయస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఏ పని చేయకపోయినా, అన్నీ తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబు నైజం అని, మార్కెటింగ్‌లో ఆయనను మించిన దిట్ట ప్రపంచంలోనే ఎవరూ లేరని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో కూడా చంద్రబాబు, అలాగే ప్రచారం చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు సాధించి, తగిన భూమి సేకరించి, పనులు మొదలుపెట్టి, శరవేగంగా కొనసాగించింది తమ ప్రభుత్వమని గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. దాదాపు 1900 ఎకరాల భూమిని రైతులకు తగిన పరిహారం చెల్లించి సేకరించామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు.

మూలపేటలో కూడా ఎయిర్‌పోర్టు కడతామన్న చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామన్న అమర్‌.. అక్కడ ఇప్పటికే తమ ప్రభుత్వం పోర్టు పనులు ప్రారంభించి, దాదాపు45 శాతం పూర్తి చేసిందని మాజీ మంత్రి గుర్తు చేశారు.

విభజన తరవాత రాష్ట్ర సీఎంగా 2014లో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఆంధ్రా యూనివర్సిటీ వేదికగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి.. విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామన్నారని ప్రస్తావించిన గుడివాడ అమర్‌నాథ్, ఆ హామీ ఏమైందని నిలదీశారు.

రాష్ట్రంలో ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ ఆర్భాటంగా కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వం.. సీనరేజ్, లోడింగ్‌ ఛార్జీలు కలిపి టన్నుకు రూ.1394 బాటా రేటు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి విమర్శించారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ.. కానీ సీటుకు, ఆర్టీసీ బస్సు డీజిల్‌కు ఛార్జీలు కట్టాలన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇన్ని షరతులతో సూపర్‌ సిక్స్‌ ఎటుపోతుందో తెలియడం లేదన్నారు.

వాలంటీర్లను తొలగించబోమని, వారికి ఇక నుంచి రూ.10 వేల గౌరవ వేతనాలు చెల్లిస్తామని, వారి ద్వారానే పెంచిన రూ.4 వేల పెన్షన్‌ను ఇంటింటికీ పంపిస్తామని ఆరోజు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని గుడివాడ అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు. మరోవైపు వాలంటీర్లను పూర్తిగా తొలగించే కుట్ర జరుగుతోందన్న ఆయన, దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.