చంద్రన్న రావాలి…జగన్‌ పోవాలి

కూటమితోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
కూటమికి మద్దతు అభినందనీయం: గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు : దొనకొండలో గురువారం సాయంత్రం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ రావాలి…జగన్‌ రెడ్డి పోవడమే తమ లక్ష్యమని తెలి పారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని స్పష్టం చేశారు. జగన్‌ మాదిగలకు తీరని అన్యాయం చేశారని, మాటమీద నిలబడకుండా అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేశాడని వివరించారు. ఎస్సీ నిధులను కూడా దారి మళ్లించారని తెలిపారు.

దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని మాదిగ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాలకు పిలుపునిచ్చారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు టీడీపీతోనే సాధ్యమని, మాదిగల సామాజికన్యాయం కూటమితోనే జరుగుతుందని పేర్కొన్నారు. కూటమికి మద్దతు తెలిపిన మందకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు మాదిగల ఆకాంక్షలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారన్నారు. దళిత ద్రోహి జగన్‌ను ఓడిరచి ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని దళిత కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.