చంద్రన్న పాలన రామ రాజ్య పాలన

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, మహానాడు :  చంద్రన్న పాలనలో అందరికీ మంచి రోజులేనని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘాల సమాఖ్య కంచికచర్ల, వీరులపాడు మండల శాఖ ఆధ్వర్యంలో కంచికచర్ల ఓసీ క్లబ్ లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గత నాలుగున్నరేళ్లలో  వైసీపీ సర్కారు టీచర్లకు ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదన్నారు.

ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా వేసీపీ వేధింపులకు గురయ్యారన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యాశాఖలో మంచి విజయాలు సాధించేందుకు అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్టేట్ టీచర్స్ యూనియన్ కంచికచర్ల, వీరులపాడు మండల శాఖ ఎమ్మెల్యే సౌమ్య దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ఆమె మాట్లాడుతూ,  ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం తక్షణమే జీవో నెంబర్ 117ను రద్దును, “తల్లికి వందనం” పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపచేసే విధంగా తీసుకునే నిర్ణయంపై, కూటమి మేనిఫెస్టో లో పెట్టిన విధంగా ఐ.ఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఏ విధమైన  ఆంక్షలు లేని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాకుండా, ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా మాతృభాషలో విద్యా బోధన జరిగే విధంగా విధానపరమైన నిర్ణయాలపై చర్చిస్తామన్నారు.

ఉపాధ్యాయుల భోధనకు ఆటంకంగా ఉన్న అనవసరమైన యాప్లను తొలగించేందుకు కృషి చేస్తానన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోని విద్యారంగ లోపాలను సరిదిద్ది, పెండింగ్లో ఉన్న ఆర్ధిక బకాయిలపై న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. 11వ PRCలో ఉపాద్యాయులకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తూ 12వ PRCని వెంటనే ప్రకటించేలా త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో చర్చించి, పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.