-పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటెలను బయటకు పంపారు
-మోదీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి
-మల్కాజ్ గిరి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మల్కాజ్ గిరి: బీఆరెస్ చచ్చిన పాముతో సమానం. కారు కార్ఖానాకు పోయింది… ఇక అది వాపస్ రాదు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉంది. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి నిదర్శనం.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
ఈటెల కొత్తవాడేం కాదు.. కేసీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినవారే. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దుర్మార్గాలకు ఈటెల కారణం కాదా? పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటెలను బయటకు పంపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారు.అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారు.
మల్కాజిగిరి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోని ఈటెల ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ, బీఆరెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు. మతం ముసుగులో ఓట్లు అడగడం కాదు.. దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి.. అలాంటివారే నిజమైన హిందువు..
ఈటెల చుట్టం లాంటి వారు… వచ్చి పోవడం తప్ప చేసేదేం లేదు.బీజేపీ కి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కు అప్పగిస్తున్నారు. రైల్వే , బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆలోచించాలి. మోదీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి. సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి. సునీతక్కను గెలిపించండి… మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది.