– బీఆర్ఎస్ నేత హరీష్ రావు
హైదరాబాద్, మహానాడు : చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావని దుయ్యబట్టారు.