సచివాలయ కార్యదర్శుల కొట్లాట

విచారణకు ఆదేశించిన అధికారులు

గాజువాక: విధి నిర్వహణలో తలెత్తిన వివాదంతో సచివాలయ ఉద్యోగులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బుధవారం సాయంత్రం గాజువాక సమీప 67వ వార్డు జోగవానిపాలెం సచివాలయంలో చోటు చేసుకుంది. పింఛనుదారుల చిరునామా వివరాలను అనుసంధానం చేసే క్రమంలో వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ జల్లూరి సమరం, ప్లాన్లింగ్‌ సెక్రటరీ అన్నెపు శ్రీనివాస్‌ వాదులాటకు దిగారు. ‘అది నా పని కాదంటే.. నా పని కాదంటూ’ పరస్పరం విమర్శించుకుని ఆ తర్వాత కొట్టుకున్నారు.

సచివాలయం అడ్మిన్‌ కార్యదర్శి రమణి వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా… ఆమెను పక్కకు తోసేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గాజువాక జోనల్‌ కమిషనర్‌ బి.సన్యాసినాయుడు గురువారం సచివాలయ ఉద్యోగులను మందలించారు. కొట్లాటపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని యూసీడీ ఏపీడీ రామును ఆదేశించారు. శ్రీనివాస్, సమరంపై సస్పెన్షన్‌ వేటు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.