ఆయనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు
రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేయించారు
అరెస్టు చేయకుంటే మోదీతో దోస్తీ బయటపడ్డట్లే…
మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు
సదాశివపేట, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని మాజీమంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సోమవారం మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడు తూ తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఆయనను అరెస్టు చేయకుంటే మోదీతో దోస్తీ బయటపడ్డట్లేనని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఉండగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేస్తే హామీలు అమలుకావని, కొట్లాడాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలన బయటపడ్డదని, బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేనని తెలిపారు. తెలంగాణకు ఎంతో నష్టం చేసిన బీజేపీని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అలవిగాని హామీలు ఇస్తే మొన్న దుబ్బకలో రఘునందన్‌ను చిత్తుగా 54 వేల ఓట్లతో ఓడిరచారు. ట్రస్ట్ ద్వారా సేవ చేస్తా అంటున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.