సీఎం క్షమాపణలు చెప్పాలి 

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన  

హైదరాబాద్, మహానాడు : మహిళా శాసన సభ్యుల పట్ల అనుచితంగా అగౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజంతా అసెంబ్లీలో తమ నిరసన తెలియజేశారు.

సబితా ఇంద్రారెడ్డికి ఈ అంశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పదేపదే స్పీకర్ కి విజ్ఞప్తి చేసినా, స్పందించకపోవడం, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ సభలో నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకు వెళ్లారు.

ముఖ్యమంత్రి అహంకారం నశించాలి… మహిళలను తప్పుగా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని… సభ్యురాలి పేరు తీసుకున్న తర్వాత ఆ అంశంపైన మాట్లాడే హక్కు వారికి ఉంటుందని పదేపదే స్పీకర్ కి విజ్ఞప్తి చేసినా స్పీకర్ స్పందించలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం అయినా ఇవ్వాలి లేదా సస్పెండైనా చేయాలని ఒక సూచనను అక్బరుద్దీన్ ఓవైసీ చేశారు.

అయినా ప్రధాన ప్రతిపక్షానికి స్పీకర్ ఈ అంశంలో అవకాశం ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రి అహంకారానికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

దీంతో మార్షల్ భారీ ఎత్తున పోగై  ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని తెలంగాణ భవన్ కి తరలించారు. సీఎం ఛాంబర్ ముందు నిలబడి బీఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ,కోవా లక్ష్మిలు నిరసన కొనసాగించారు.