స్టేజ్ పైనే కూటమి నేతల విరాళాల సేకరణ

దేవరపల్లి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల సాక్షిగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఆ వేడుకల్లో హాజరైన వారు వెంటనే స్పందించారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే విరాళాల సేకరణ మొదలైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు హాజరయ్యారు. భారీ వరదల వల్ల నష్టపోయిన విజయవాడ ప్రజలను ఆదుకోవాలని పిలుపునివ్వడంతో సభకు హాజరైన వారందరూ విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే పిలుపుతో వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం చూసిన వారందరూ ఆనందం వ్యక్తం చేశారు. శభాష్ ఎమ్మెల్యే మద్దిపాటి అంటూ ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.