సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ 

తాడేపల్లి, మహానాడు:  తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం  జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ తుషార్ దూడి , తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్  లతో కలసి పరిశీలించారు.

ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి పాల్గొనే పూజా కార్యక్రమ స్థలంతో పాటు సభా స్థలి ప్రాంతాన్ని పరిశీలించారు. భక్తులు , వాలంటీర్లు కూర్చునే గ్యాలరీని పరిశీలించి సూచనలు అందించారు. వాహనాల పార్కింగ్ , బ్యారికేడ్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ ను సజావుగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.  కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతర విద్యుచ్చక్తి సరఫరా ఉండేటట్లు తగు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ వాహనాలను సిబ్బందితో పాటు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మేరకు మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేయాలని డీఎం అండ్ హెచ్ఓ కు సూచించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డియం అండ్ హెచ్ డా. విజయలక్ష్మీ,  జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస రెడ్డి, తాడేపల్లి తహశీల్దార్ విజయ కుమార్ , ఆర్ అండ్ బి , విద్యుచ్చక్తి , యంటియంసి అధికారులు పాల్గొన్నారు.