వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్
అధికారులు సమన్వయంతో పని చేయాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడండి
డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలు తొలగించండి
గుంటూరు, మహానాడు: నగరంలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని ప్రజలకు అందించేందుకు వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ మేరకు సూపర్వైజరి అధికారులు పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని డీఆర్సీ హాల్లో నగర కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు ప్రణాళికాబద్దంగా జరిగేందుకు జిఎంసి ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సూపర్వైజరి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. సాదారణంగా ప్రజలు మెరుగైన పారిశుధ్యం, త్రాగునీటి సరఫరాని అధికంగా కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించడం కనీస భాధ్యత అన్నారు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా పై ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి పలు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాలి
నగరంలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని సాధించేందుకు ప్రతి డివిజన్ లో వీక్లీ వర్క్ ప్లాన్ ఉండాలని, సదరు ప్లాన్ ని ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కూడా అందించాలన్నారు. వీక్లీ ప్లాన్ మేరకు పక్కాగా పనులు జరిగేలా సూపర్వైజరీ అధికారులు పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్ల మీద వ్యర్ధాలు ఉండటానికి వీలు లేదని, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఫిర్యాదులు వస్తే ఇరు విభాగాల అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడిక తీత పనులు జరుగుతున్నప్పటికీ అంతర్గత వీధుల్లోని డ్రైన్లలో పూడికతీత జరగడం లేదని, ఫలితంగా వర్షాలకు డ్రైన్ ఓవర్ ఫ్లో జరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక నుండి ప్రతి రోజు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా అంతర్గత డ్రైన్లు శుభ్రం చేసేలా సూపర్వైజరి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడండి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యాంటీ మలేరియా యాక్టివిటీ చేపట్టాలని, ఖాళీ స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి బోర్డ్ లను పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ లో నీరు సమృద్ధిగా ఉందని, నగరంలో నీటి సరఫరాని క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని ప్రాంతాలకు అధికంగా, మరికొన్ని ప్రాంతాలకు కనీసం త్రాగడానికి నీరు ఇవ్వలేక పోవడం సరికాదన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పైప్ లైన్లు ఎక్కడైనా డ్రైన్ లో ఉంటే వెంటనే షిఫ్ట్ చేయాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులు వేగంగా పరిష్కారం చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తమకు ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను పిలిస్తే వెళ్లాలని తెలిపారు.
కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు వీక్లీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి, ప్లాన్ మేరకు పారిశుధ్య పనులు చేపడతామన్నారు. ఇప్పటికే 16 మంది సీనియర్ అధికారులను పారిశుధ్య పర్యవేక్షణకు విధులు కేటాయించామని, నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో నిర్మాణం పెండింగ్ లో ఉన్న గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల (జిటిఎస్) నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. వీధి వ్యాపారులు తప్పనిసరిగా వ్యర్ధాలను జిఎంసి నుండి కేటాయించిన వాహనంకే వ్యర్ధాలు ఇవ్వాలని, రోడ్ల మీద, కాల్వల దగ్గర వేస్తె భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామన్నారు. నగరంలో కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాల సేకరణకు వెంటనే టెండర్ పిలవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలు తొలగించండి
క్షేత్ర స్థాయిలో చెత్త తరలించడంలో వాహనాల సమస్య ఉండకూడదని, ఉదయం 6 గంటల కల్లా వాహనాలు షెడ్ నుండి కేటాయించిన వార్డ్ లకు వెళ్లాలన్నారు. వాహనాల వివరాలపై ప్రతి రోజు వెహికిల్ షెడ్ ఈఈ, ఎంహెచ్ఓ తమకు నివేదిక ఇవ్వాలన్నారు. డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను, ర్యాంప్ లను పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించాలని, పూడిక తీసిన వెంటనే కుప్పలు అక్కడే ఉండకుండా తరలించాలన్నారు. స్పెషల్ అధికారులు ప్రతి రోజు తమ క్షేత్ర స్థాయి పరిశీలన నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే నగరంలో డ్రైన్ ను క్రాస్ చేస్తున్న లేదా సమాంతరంగా వెళ్తున్న త్రాగునీటి పైప్ లైన్లను ఇప్పటికే పలు ప్రాంతాల్లో మార్చామని, ఇంకా ఎక్కడైనా గుర్తిస్తే వాటిని యుద్దప్రాతిపదికన మార్చడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైన అనుమతులు తక్షణం ఇస్తామని తెలిపారు. వీధి కుక్కలకు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి) ఆపరేషన్లు చేస్తున్నామని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. రిజర్వాయర్ పరిధిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా స్థానికంగా ఏఈలు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం పారిశుధ్య సమస్యలు, పరిష్కరాలకు అభిప్రాయాలను సూపర్వైజరీ అధికారుల వారీగా తెలుసుకున్నారు. సమావేశంలో ఎస్ఈ శ్యాం ప్రసాద్, ఏంహెచ్ఓ మధుసూదన్, ఏడీహెచ్ రామారావు, డిసిపి శ్రీనివాస్, ఏసిపి మురళి, ఈఈలు ఎస్.ఎస్.లు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.