అధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు!

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ

విజయవాడ, మహానాడు: అధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్… నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుంది. 370 ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటుంది.

కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. తీవ్రవాదులకు మద్దతిచ్చే పార్టీలతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పెట్టుకుంది. రాహుల్ గాంధీ పొత్తుపై సమాధానం చెప్పాలి. పదే పదే దేశ ఐక్యతను, భద్రతను పణంగా పెట్టి అధికార దాహం తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ…. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అబ్దుల్లా కుటుంబానికి చెందిన ‘నేషనల్ కాన్ఫరెన్స్’తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరోసారి తన కుటిల ఉద్దేశాలను బయటపెట్టింది.