బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ వెయ్యి రెట్లు బెటర్‌

వ్యవసాయం, ధాన్యం సేకరణలో ముందున్నాం
ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం
భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు బోనస్‌ ఇస్తాం
పేదోళ్లు కూడా సన్నబియ్యం తినాలన్నదే తమ ఉద్దేశం
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
వచ్చే ఎన్నికల నాటికి హామీలన్నీ పూర్తిచేస్తాం
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, ధాన్యం సేకరణలో వెయ్యి రెట్లు మేలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశాం. ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నాం. తరుగు, తాలు పేరుతో కోతలు లేవు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ సాగింది. ఈ దఫా ఉక్కుపాదం మోపడంతో కోతలకు చెక్‌ పడిరది. దీంతో ప్రతి కింటాపై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చాం. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వేస్తున్నాం. గతంలో 45 రోజులు పట్టేది. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడు. ఇప్పుడు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవు.

రైతులకు పంట నష్ట పరిహారం

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఫసల్‌ బీమా యోజన లేదు. ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేది. అయినప్పటికీ కాంగ్రెస్‌ రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందిస్తోంది. ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంట బీమా పథకాన్ని రూ.3,000 కోట్లు వెచ్చించి వానాకాలం నుంచి అమలు చేస్తున్నాం. తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో కల్లాల్లో వరి కుప్పల మీద రైతులు గుండె పగిలి చనిపోయారు. కానీ మాది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారు.

భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు బోనస్‌

తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతోటి దొడ్డు వడ్లనే పాలిష్‌ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్‌ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్‌ పథకాన్ని ప్రవేశపెట్టాం. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు దీనిని అమలుచేస్తాం.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

రైతులను కాల్చుకు తిన్న బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు ఇప్పుడు రైతుల పేర నాటకాలు ఆడుతున్నారు. సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని 2020లో కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్నా నయా పైసా బోనస్‌ ఇవ్వలేదు. అందుకే ఓడగొట్టి రైతులు ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజా ప్రభుత్వం ఎక్కడా దుబారా చేయకుండా కేసీఆర్‌ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. త్వరలో అన్ని హామీలను నిలబెట్టుకుంటాం. వందరోజు ల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభించాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతాం. లేకుంటే ఓట్లే అడగం. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు తమ తప్పుడు ప్రకటనలు ఆపాలని హితవు పలికారు.