Mahanaadu-Logo-PNG-Large

సీఎంవోలో ఫైళ్ల మాయానికి కుట్రలు

జగన్‌ తొత్తులైన అధికారులకు మూల్యం తప్పదు
ఫైళ్లు కదల్చకుండా గవర్నర్‌ ఆదేశాలివ్వాలి
ఆఫీసుల్లో పత్రాలు ధ్వంసం చేయకుండా చూడాలి
మాచర్ల, చంద్రగిరిలో దాడుల నివారణలో విఫలం
వైసీపీకి కొమ్ముకాసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలి
వచ్చేది కూటమి… జగన్‌రెడ్డి గద్దె దిగటం ఖాయం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార మార్పిడి తథ్యమైంది. జగన్‌రెడ్డి గద్దె దిగటం ఖాయమని స్పష్టమైంది. తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ముఖ్యమైన పత్రాలను ఆటోల్లో తరలించి దహనం చేశారు. ఏపీలో అలా జరగకుండా ఏ పత్రం కదలకుండా గవర్నర్‌ ఆదేశించాలని కోరారు. ఐదేళ్ల పాలన అంతా తప్పుల తడకే. చంద్రబాబు అధికారంలోకి వస్తే లొసుగులు అన్ని బయటకువస్తాయని కొంతమంది అధికారులు భయపడుతున్నారు. పత్రాలను మాయం చేసేందుకు చూస్తున్నారు. గతంలో కొల్లి రఘురామరెడ్డి ఫైల్స్‌ను తగలబెట్టించాడు. అలా పత్రాలను మాయం చేసేందుకు జగన్‌ తొత్తులు ఉండి తప్పులు చేసిన అధికారులు యత్నిస్తున్నారు.

ఈ ఆఫీస్‌ను ఎలా మూసేస్తారు

ఈ ఆఫీస్‌ను ఎలా క్లోజ్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు రాకుండా చీఫ్‌ సెక్రటరీ మూసేయడానికి ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వేచి ఉండాలి. ఎటువంటి ఫైల్స్‌ను కదిలించడానికి వీల్లేదు. ఈ ఫైల్స్‌, మాన్యువల్‌ ఫైల్స్‌ క్లోజ్‌ చేయడానికి వీల్లేదు. పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు తగలబెడుతున్నారు. ఏ ఫైల్‌ డిస్ట్రాయ్‌ చేయకూడదని డీజీపీ ఆదేశించాలి. అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగిన అధికా రులు, అధికార పార్టీతో లాలూచీ పడిన అధికారులకు శిక్ష పడాల్సిందే. అధికారులు చేసిన తంతును బయటపెడతామని హెచ్చరించారు.

తాడిపత్రి డీఎస్పీని అరెస్టు చేయాలి

మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేటల్లో కొంతమంది అధికారులు వైసీపీకి కొమ్ముకాస్తూ పనిచేశారు. విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోలేదు. తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వైసీపీతో అంటకాగుతూ వైసీపీ మూకలు రెచ్చిపోతున్నా పట్టించుకోలేదు. డీఎస్పీ చైతన్యపై 23 ప్రైవేట్‌ ఫిర్యాదులు ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలు తాడిపత్రిలో పనిచేసి పెద్దారెడ్డి సేవలో తరించాడు. జేసీ దివాకర్‌ రెడ్డి, ప్రతిపక్షాలను హింసించాడు. పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చాడు. జేసీ దివాకర్‌రెడ్డి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి దివ్యాంగుడైన కిరణ్‌పై మానవత్వం లేకుండా దాడి చేశాడు. కులం పేరుతో తిట్టి జేసీ ఆఫీసులోని ఫర్నిచర్లు ధ్వంసం చేశాడు. డీఎస్పీ చైతన్య అరాచకాలపై వెంటనే డీజీపీ స్పందించాలి. ఆయన పెద్దారెడ్డికి కూలీగా పనిచేశాడు. వెంటనే డీఎస్పీ చైతన్యను అరెస్టు చేయాలి. వెంటనే బేడీలు వేసి లాకప్‌లో వేయాలి. జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలి. అప్పు డే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది.