– కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆరోపణ
శ్రీకాకుళం, మహానాడు: వైసీపీ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి కాంట్రాక్టులు, దర్శనాల విషయాల్లో అవినీతికి పాల్పడ్డారు… 500 రూపాయలు టికెట్లను ఐదు వేలకు అమ్ముకున్నారు… వాళ్లకు నచ్చిన కాంట్రాక్టర్లకు, ట్రేడర్లకు పనులు అప్పగించి, ముడుపులు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో ఏమన్నారంటే… తిరుమల లడ్డూలో అందరూ అనుకుంటున్నట్టుగా గొడ్డు, పంది, చేపల మాసం కల్తీ జరగలేదు. లడ్డుకు వాడే నెయ్యిలో నూనె, పామాయిల్ కల్తీ జరిగిన మాట వాస్తవం. లడ్డు రాజకీయాల్లోకి వచ్చింది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. లడ్డు గురించి భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అడుగుతున్నారు.
బయట మార్కెట్లో నాణ్యమైన నెయ్యి 750 రూపాయల నుంచి 800 ధర పలుకుతోంది. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ధర్మకర్తల మండలి ట్రేడర్లు 320 రూపాయలకు నెయ్యి సరఫరా చేశారు. లాభాల కోసం నెయ్యిలో వంట నూనె కల్తీ చేశారు. లడ్డును తయారు చేసేది కూడా ప్యూర్ వెజిటేరియన్లే (కుల ప్రస్తావన ఇష్టం లేదు). టీటీడీ ఉద్యోగస్తులు చాలా మంచివాళ్లు. గత ధర్మకర్తల మండలి అవకతవకలు జరిగాయి.
హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖండ విజయం సాధించబోతోంది. రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోని 23 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలపడడం ఖాయం. సూపర్ 6 పథకాలు వంద రోజుల్లో అమలు చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారు. ఉచిత బస్సు సౌకర్యం ఏ తేవా నుంచి అమలు చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. పింఛన్ల పంపిణీకే ముఖ్యమంత్రి, మంత్రులు పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి గురించి, ఇక్కడ ఉన్న భారీ నిరుద్యోగం గురించి ఆలోచించడం లేదు. శ్రీకాకుళం నుంచి ఆముదాలవలసకు కొత్తగా రోడ్డు వేస్తున్నారని విన్నాను. అది తప్ప, శ్రీకాకుళంకి చంద్రబాబు నాయుడు చేసిందేమిటి? పోలవరం పొలిటికల్ లీడర్లకు, కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరంగా మారలేదు. పోలవరం ప్రాజెక్ట్ పెద్ద అంతర్జాతీయ స్కాం.
ఏపీ అనగా అమరావతి, పోలవరం అంటారు చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు 30 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చయింది. ఇంకా 30 వేల కోట్లు అవసరమని అంటున్నారు. అంత డబ్బు ఇచ్చిన అది ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలీదు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరెవరి పాలనలో ఎంత డబ్బు ఖర్చయిందో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాలి. అమరావతి కృష్ణా నదిలో ఉంది. 1075 కోట్లు ఖర్చు చేసి, 5 బ్లాకుల్లో సచివాలయం కట్టారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, యువత స్వయం ఉపాధికి, మహిళా స్వయం ఉపాధికి చక్కటి పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి ఇంటికి పాడి ఆవులను ఇచ్చి తద్వారా, స్వయం ఉపాధి కల్పించడంతోపాటు, నాణ్యమైన నెయ్యిని టీటీడీకి అందించవచ్చు.