– కుమారుడికి గాయాలు
– రెండు పశువులు మృతి
– గంగంపల్లి తండాలో ఘటన
– బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
– కలెక్టర్ టీఎస్ చేతన్ వెల్లడి
పుట్టపర్తి, మహానాడు: గోరంట్ల మండలం గంగంపల్లి మజరా దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం ఉదయం పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ టీఎస్ చేతన్ వెంటనే స్పందించి పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, సీఐ శేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన వాస్త వాలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు. అలాగే సంఘటనలో గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం తీసుకెళ్లవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు.
పిడుగుపాటుకు దశరథ్ నాయక్ (48), దేవి బాయి (45) మృతి చెందారు. వీరి కుమారుడు జగదీష్ నాయక్ (27) గాయాల పాలవడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున పరిహారం కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని కలెక్టర్ తెలిపారు. గాయపడిన వ్యక్తికి రూ.50, 000లు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే ఇదే సంఘటనలో రెండు ఆవులు కూడా మరణించాయి. ఒక్కొక్క ఆవుకు రూ.37,500 చొప్పున అందజేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు కలెక్టర్ తన సంతాపాన్ని తెలిపారు. ప్రభుత్వపరంగా అవకాశాలు ఉన్న మేరకు కుటుంబాలను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.