– కొందరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు
– ఇటుక ఇటుక పేర్చి అధికారంలోకి వచ్చాం
– పార్టీకి నష్టం వస్తే సహించను
– వారిని పిలిచి మాట్లాడతా
– నెలలో నామినేటెడ్ పదవుల శుభవార్త
– క్యాబినెట్ విషయాలు లీక్ చేయవద్దు
– మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు
– క్యాబినెట్ భేటీలో చంద్రబాబు
( సుబ్బు)
‘‘కొందరు ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. వారి ప్రవర్తనపై మీడియాలో చెడ్డగా వస్తోంది. అలాంటి వారు తీరు మార్చుకోకపోతే చర్య తప్పదు. మీరు కూడా బాధ్యత తీసుకుని, ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయాలి. క్యాబినెట్‌లో జరిగే చర్చలను బయటకు చెప్పవద్దు’’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో, కట్టుదాటుతున్న కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో వస్తున్న కథనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ, పార్టీకి అప్రతిష్ఠ తీసుకురావడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనం ఐదేళ్లపాటు కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అధికారంలోకి వచ్చాం. ప్రజలు మనపై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. మనం గత ప్రభుత్వంలో మాదిరిగా వ్యవహరించకూడదు. ఇలాంటి పనులు చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుంది కదా?
మీరు కూడా వీటిపై దృష్టి సారించి, ఎమ్మెల్యేలతో మాట్లాడండి. నేను కూడా అలాంటి వారిని పిలిచి మాట్లాడతా. పద్ధతి మార్చుకోమని హెచ్చరిస్తా. పార్టీకి నష్టం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవు. మితిమీరి వ్యవహరిస్తే వేటు తప్పదు. పార్టీకి అప్రతిష్ట తెచ్చే పనులను నేను అనుమతించను. నా నివేదికలు నాకున్నాయి. దాని ప్రకారమే వ్యవహరిస్తా. ఐదేళ్లు మనం పడ్డ కష్టం ఇలాంటి పనులతో కొట్టుకుపోవడాన్ని నేను సహించను.
మీడియాలో వార్తలు చూడండి. దాని వల్ల మనందరికీ చెడ్డపేరు వస్తుంది. కుటుంబసభ్యులను కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. మీరంతా బాధ్యత తీసుకుని మీ జిల్లాలో ఎమ్మెల్యేలను గైడ్ చేయండి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలతోపాటు.. మీపైనా ఉంది. ఎందుకంటే మనం చేసే మంచిపనులన్నీ పోయి, ఇలాంటివి హైలెట్ అవుతుంటాయి. మీ వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తాం. జనసేన మంత్రుల రిపోర్టులు పవన్ కల్యాణ్ ఇస్తారు. నెలరోజుల్లోగా నామినేటెడ్ పోస్టులపై శుభవార్త వింటారు.