– ఎమ్మెల్యే ప్రత్తిపాటి
చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో పాడిరైతులు ఎవరూ విపక్ష వైకాపా చేస్తోన్న తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు వ్యవసాయశాఖ మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. పాడిరైతులను అన్ని విధాల ప్రోత్సహించాలి, వారికి అదనపు ఆదాయాలు అందించి ఆలంబనగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అని స్పష్టం చేశారాయన. ఆ దిశగా పాల ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంగళవారం చిలకలూరిపేట 11వ వార్డు పరిధిలోని మానుకొండవారిపాలెంలో సంగం డెయిరీ పాడి రైతులకు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని పాడి రైతులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పాల ఉత్పత్తిదారులకు రూ.8.64 లక్షలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద, ధూళిపాళ్ల నరేంద్ర మీద కక్షతో వైకాపా ప్రభుత్వం హయాంలో సంగం డెయిరీని ఎన్నివిధాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారో అంతా గమనించారన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతుల్లో నింపిన విశ్వాసం కారణంగానే వాటన్నింటినీ తట్టుకుని ఈరోజు మళ్లీ ఇలా సగౌరవంగా తలెత్తుకుని నిలబడడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గత పాలకులు రాష్ట్ర పాడిపరిశ్రమ మొత్తాన్ని అమూల్‌కు కట్టబెట్టాలని చూసినా సంగం డెయిరీని కాపాడిన నాయకుడు, ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అని అభినందించారు. అటువంటి దుర్మార్గపు పాలన సాగించారు కాబట్టే ప్రజలు వైకాపాను 151 నుంచి 11కి పడేశారని స్వాతంత్ర్య భారతంలోనే అత్యధిక మెజార్టీలతో కూటమిని గెలిపించారన్నారు. పాల దిగుబడి పెంచేందుకు ఊరూరా గడ్డిక్షేత్రాలు ప్రారంభించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా అంతా గుర్తుంచుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థికసాయం కూడా లభిస్తుందని ఆ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మానుకొండవారిపాలెంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ పడిపోయే దశలో ఉందని స్థానికుల చెప్పారని, తక్షణమే ఆ పథకాన్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దాని నిర్మాణం పూర్తిచేస్తే నిధులు విడుదల చేస్తారన్నారు. త్వరితగతిన పాత ట్యాంక్ కూల్చివేసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు.