సీఎం దృష్టికి ‘దర్శి’ సమస్యలు

– ఈ ప్రాంతంలో పర్యటించాలని టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి ఆహ్వానం

మద్దిరాలపాడు, మహానాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు గ్రామానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా వంద రోజుల్లో 1000 మంచి పనులు చేసిన చంద్రబాబుని లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వరద వంటి విపత్తులను దాటుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ వంద రోజుల్లో అనేక అద్భుతాలు చేపట్టి ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొందుతున్న చంద్రబాబుకి జేజేలు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు త్వరితగతిన అమలైయేందుకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో అనేక సమస్యలు తిష్ఠ వేశాయని కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధిగా చేయాల్సిన బాధ్యత నేను తీసుకున్నానని లక్ష్మి బాబుకి వివరించారు.

దర్శి నియోజకవర్గంలో పర్యటించాలని సీఎంని డాక్టర్ లక్ష్మి కోరారు. వీటన్నింటిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిరంతరం ప్రజల్లో పనిచేయాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరేందుకు మీరు అక్కడ వారధులుగా పని చేయాలని చంద్రబాబు కోరారు.