సింగరేణి భవిష్యత్తుకు భరోసా డిప్యూటీ సీఎం భట్టి

-నైనీ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు
-రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్ష
-కొత్త బొగ్గు బ్లాక్‌ల కోసం నాటి బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి విజ్ఞప్తి
-తాజాగా నూతన బొగ్గు శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికీ విన్నపం
-ఒడిశా నైనీ బ్లాక్‌ ఉత్పత్తి త్వరగా మొదలవడానికి స్వయంగా ఆ రాష్ట్ర సీఎంతో భేటీ
-సింగరేణి బొగ్గు బ్లాక్‌ల కోసం, నైనీ కోసం గత పదేళ్లుగా ఏ మంత్రీ తీసుకోని చొరవను చూపించిన
-డిప్యూటీ సీఎం భట్టి సింగరేణీయుల హర్షం

హైదరాబాద్ : తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి భవిష్యత్‌, విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టిసారించింది. సింగరేణి కేంద్రమైన ఖమ్మం జిల్లాలో జన్మించి.. పీపుల్స్ మార్చ్ పేరుతో సింగరేణి జిల్లాలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావడం, ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సింగరేణి దశ తిరిగింది.

సింగరేణి ప్రగతి కోసం. రాజకీయాలకు అతీతంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉండి దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలను తీర్చుతున్న సింగరేణి మనుగడకు కీలకమైన నూతన బొగ్గు బ్లాక్‌ లు, తొలిసారిగా ఆ సంస్థ తెలంగాణ వెలుపల చేపట్టబోతున్న నైనీ ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభమయ్యే విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సింగరేణి అవసరాలు, ప్రభుత్వం నుంచి లభించాల్సిన సాయంపై సింగరేణి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం కంపెనీ మనుగడ కోసం తాడిచెర్ల బ్లాక్‌-2, నైనీ ప్రాజెక్టు అత్యవసరమని గుర్తించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఏడాది మార్చి 7వ తేదీన ప్రత్యేకంగా అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి సింగరేణికి తాడిచెర్ల బ్లాక్‌-2ను కేటాయించాలని, ఇందుకోసం ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు.
అదే సమయంలో నైనీ ప్రాజెక్టును ప్రారంభించడంలో స్టేజ్‌ -2 అనుమతులు త్వరగా లభించేందుకు కేంద్రం తరఫున చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అప్పటి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సానుకూలంగా స్పందించారు. తాడిచెర్ల విషయంలోనూ, నైనీ విషయంలోనూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బొగ్గు గనుల కేటాయింపులో సింగరేణికి న్యాయం చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దీనిపై కిషన్‌ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నైనీ బ్లాక్‌ విషయంలో వీలైనంత త్వరగా అటవీ భూమి బదలాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే సింగరేణి నైనీ బ్లాక్‌కు సంబంధించి స్టేజ్‌-2 అనుమతులతో పాటు వన్యప్రాణి సంరక్షణ ప్రణాళికకు ఆమోదం లభించినందున.. వీలైనంత తర్వగా అటవీ భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మారీaని కలిశారు.

ఒడిశాలో సింగరేణికి నైనీ ప్రాజెక్టును కేటాయించి దాదాపు పదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ.. మంత్రి హోదాలో కానీ ఏ ఒక్కరూ పర్యటించిన దాఖలాలు లేవు.

కానీ సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం, సంస్థ ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు ఢిల్లీకి, ఒడిశాకు ప్రత్యేకంగా వెళ్లారు. నైనీ విషయంలో అటవీ భూములు, చెట్ల గణన, తొలగింపు, హై టెన్షన్‌ లైన్‌ మళ్లింపు, సింగరేణి ప్రారంభించాలనుకుంటున్న పవర్‌ ప్లాంట్‌ కోసం భూమి తదితర అన్నింటిపైనా సమగ్రమైన విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందనతోపాటు అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో సింగరేణి నైనీ నుంచి మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం.. ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి చూపుతున్న చొరవపై సింగరేణి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.